దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. ఇద్దరు నిందితులు ఘజియాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో ఖతం

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించారని అధికారులు వెల్లడించారు. పోలీసులు చెప్పినట్టు, ఈ ఇద్దరు అనుమానితులు అంతర్జాతీయ నేరస్థుల ముఠాతో సంబంధం కలిగి ఉన్నారని గుర్తించారు.

పోలీసుల ప్రకారం, ఈ ఘటన తెల్లవారుజామున 3:45 గంటలకు చోటుచేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు, నిందితుల మధ్య ఎదుర్కాల్పులు జరిగాయి. నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేసి ఖతం చేశారు.

సెప్టెంబర్ 12న జరిగిన ఈ కాల్పుల సమయంలో దిశా పటానీ ఇంట్లోనే ఆమె పేరెంట్స్, అక్క, తండ్రి (రిటైర్డ్ పోలీస్ కమిషనర్) ఉన్నారు. ఈ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నోయిడా యూనిట్ మరియు దిల్లీ క్రైమ్ ఇంటెలిజెన్స్ (CI) యూనిట్ సంయుక్తంగా నిర్వహించింది. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర మరియు సోనిపట్‌కు చెందిన అరుణ్గా గుర్తించారు.

సోషల్ మీడియాలో ప్రచారమైన సమాచారం ప్రకారం, దిశా సోదరి ఖుష్బూ పటానీ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే, ఖుష్బూ పటానీ ఈ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించి, నేరాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరియు చెప్పిన 24 గంటల్లోనే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

Leave a Reply