AMMA President: 30 ఏళ్ల తర్వాత ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా మహిళ! నటి శ్వేతా మీనన్ రికార్డ్

మలయాళ సినీ పరిశ్రమలో నటి శ్వేతా మీనన్ ఒక చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా నిలిచారు. మూడు దశాబ్ధాలకుపైగా చరిత్ర కలిగిన ‘అమ్మ’ సంస్థలో ఇప్పటి వరకు ప్రెసిడెంట్ పదవి పురుషులకే పరిమితమైంది. గతంలో మోహన్‌లాల్, మమ్ముట్టి, ఎం.జి. సోమన్ వంటి అగ్ర తారలు ఈ పదవిలో పనిచేశారు. అయితే 31 ఏళ్ల తర్వాత ఈసారి ఒక మహిళా ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

శ్వేతా మీనన్ తన ప్రత్యర్థి నటుడు దేవన్‌ను ఓడించి విజయం సాధించారు. ఆమెతో పాటు మరికొంతమంది మహిళలు కూడా ‘అమ్మ’లో కీలక పదవులు చేపట్టారు. జనరల్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ ప్రియ, జాయింట్ సెక్రటరీగా అన్సిబా హసన్ ఎన్నికయ్యారు.

ఇక శ్వేతా మీనన్ ఎన్నికకు ముందు ‘అమ్మ’ అధ్యక్షుడిగా మోహన్‌లాల్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే గతేడాది ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంతో, 2027లో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే ఈ ఏడాది నిర్వహించారు. ఎన్నికల్లో శ్వేతా గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొన్నా, ఆమెపై ఉన్న పాత ఆరోపణలను తోటి నటులు ఖండించడంతో చివరికి విజయం ఆమె సొంతమైంది.

ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత శ్వేతా మీనన్ మాట్లాడుతూ, “మీ అందరూ ‘అమ్మ’కు ఒక మహిళ అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారు. ఈ రోజు ఆ కల నెరవేరింది. ఇకపై అందరిని తిరిగి సంఘంలోకి ఆహ్వానించి కలిసికట్టుగా పనిచేస్తాం” అని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, నటి శ్వేతా మీనన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1991లో అనస్వరం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా కలిమన్ను సినిమాలో ప్రసవ సన్నివేశంలో ఆమె నటనకు రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు దక్కాయి.

తెలుగులో 1995లో దేశద్రోహులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఆనందం, జూనియర్స్, నాగార్జున నటించిన రాజన్న వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply