Akshay Kumar : అక్షయ్ కుమార్ గొప్ప మనసు.. వరద బాధితులకు రూ. 5 కోట్ల విరాళం!

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పంజాబ్‌లో సంభవించిన భీకర వరదల బాధితుల కోసం ఆయన రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న పంజాబ్ ప్రజలకు సహాయం చేయడం తన అదృష్టమని అక్షయ్ తెలిపారు. ఇది విరాళం కాదని, ప్రజాసేవగా భావిస్తున్నానని చెప్పారు. “నా పంజాబ్ సోదరులు, సోదరీమణులను తాకిన ఈ ప్రకృతి వైపరీత్యం త్వరగా తొలగిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆయన అన్నారు.

ఇలాంటి సంక్షోభాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో అక్షయ్ ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా చెన్నై వరదలు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారీ విరాళాలు అందించారు. అంతేకాకుండా, సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు భారత్ కే వీర్ అనే కార్యక్రమాన్ని కూడా స్థాపించారు.

ఈసారి పంజాబ్ వరదలతో బాధపడుతున్న ప్రజలకు అక్షయ్ ఇచ్చిన సహాయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఆయనతో పాటు సోనూ సూద్, దిల్జిత్ దోసాంజ్, అమీ విర్క్, కపిల్ శర్మ వంటి అనేక మంది ప్రముఖులు కూడా ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందిస్తున్నారు.

పంజాబ్‌లో భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లడం, ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల వరదలు ఉధృతమయ్యాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 1,655 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 3.5 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగిపోవడంతో గోధుమ, వరి వంటి ప్రధాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Leave a Reply