Saroja Devi: ప్రముఖ నటి బి. సరోజాదేవి కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ రంగానికి అమూల్యమైన సేవలందించిన దిగ్గజ నటి బి. సరోజాదేవి (87) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఈరోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ మరణ వార్తను అధికారికంగా ప్రకటించారు.

బి. సరోజాదేవి తన కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 200కి పైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి దిగ్గజ హీరోల సరసన ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉన్నాయి.

1938 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి, తన తొలి సినిమా ప్రయాణాన్ని కన్నడ చిత్రం “మహాకవి కాళిదాస” (1955)తో ప్రారంభించారు. ఈ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకోవడంతో పాటు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

తెలుగు తెరపై ఆమె తొలి చిత్రం “పాండురంగ మహత్యం” (1957), ఇందులో ఎన్టీఆర్ సరసన నటించారు. ఆ చిత్రంలో డబ్బింగ్‌ను కృష్ణకుమారి అందించగా, తరువాతి చిత్రాల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. “సీతారామ కళ్యాణం”, “ఆత్మబలం”, “పెళ్లికనుక” వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆమె అభినయ ప్రతిభను చాటారు.

సినీ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992)తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు, 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర పురస్కారాలను అందించింది.

ఇది మాత్రమే కాకుండా, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు – సౌత్, రోటరీ శివాజీ అవార్డు (2007) వంటి గౌరవాలు కూడా ఆమె సొంతమయ్యాయి. ఆమె 1998లో 45వ జాతీయ చలనచిత్ర అవార్డులు, 2005లో 53వ జాతీయ అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2010లో భారతీయ విద్యా భవన్ “పద్మభూషణ్ బి. సరోజాదేవి నేషనల్ అవార్డు”ను ప్రారంభించింది. ఇది ప్రదర్శన కళలలో జీవన సాఫల్యాన్ని గుర్తించి అందించే ప్రతిష్టాత్మక అవార్డుగా కొనసాగుతోంది.

సరోజాదేవి మరణంతో భారత సినీ పరిశ్రమ ఒక గొప్ప నటి, మహోన్నత కళాకారిణిని కోల్పోయింది.

Leave a Reply