Mirai vs Kishkindha Puri: మిరాయ్ vs కిష్కింధపురి.. బాక్సాఫీస్ క్లాష్.. ఎవరు గెలుస్తారు?

ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ కాబోతోంది. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ “మిరాయ్” మరియు హారర్ థ్రిల్లర్ “కిష్కింధపురి” ఒకే రోజు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి.

తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన కిష్కిందాపురి హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. రెండు సినిమాలు వేర్వేరు జానర్స్‌లో ఉండటం, ఒకేసారి విడుదల కావడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇటీవలి ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, “మేమే ముందుగా మా విడుదల తేదీని ప్రకటించాం. మిరాయ్ టీమ్ ముందే తెలియజేసి ఉంటే బాగుండేది” అంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడుతూ, “మిరాయ్ టీమ్ కూడా చాలా కష్టపడింది. మనోజ్ గారు, తేజ, కార్తీక్ అందరూ నాకు మంచి ఫ్రెండ్స్. వాళ్ల సినిమా కూడా హిట్ అవ్వాలి” అంటూ గొప్ప మనసు చూపించారు.

ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైతే ఒకదానిపై మరొకదానికి ప్రభావం పడుతుందని, అందుకే ముందుగానే ప్లానింగ్ ఉంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. “కొన్ని రోజుల్లో థియేటర్లు ఖాళీగా ఉంటాయి. కాస్త స్ట్రాటజిక్‌గా రిలీజ్ ప్లాన్ చేస్తే అందరికీ బెటర్” అన్నారు.

ఇక కిష్కింధపురి ప్రమోషన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ జోరుగా కొనసాగిస్తున్నారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. మరోవైపు మిరాయ్ కూడా టెక్నికల్ హంగులతో వేరే స్థాయిలో ఉందనే టాక్ వస్తోంది.

సెప్టెంబర్ 12న ప్రేక్షకులకు రెండు భిన్నమైన జానర్స్ వినోదం అందించబోతున్నాయి. ఒకటి ఫాంటసీ యాక్షన్, మరొకటి హారర్ థ్రిల్లర్. ఇక బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేది ఏ సినిమా అనేది చూడాలి.

Leave a Reply