Mirai Trailer : ‘మిరాయ్’ ట్రైలర్‌తో అంచనాలు టాప్ గేర్‌లో.. తేజ సజ్జా పాన్ ఇండియా ఎంట్రీ..!

“తొమ్మిది గ్రంథాలు వాడి చేతికొస్తే పవిత్ర గంగలో పారేది రక్తమే” అంటూ హైలైట్ చేసిన డైలాగ్‌తో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపింది.

ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ‘మిరాయ్’ ట్రైలర్ 3 నిమిషాల నిడివితోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో హీరో డైలాగ్స్, విలన్ల శక్తివంతమైన పాత్రలు, యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ కలిపి కథకు మరింత క్లారిటీ ఇచ్చాయి.

ట్రైలర్‌లో వినిపించిన శక్తివంతమైన డైలాగ్స్.. “ఈ ప్రమాదం ప్రతీ గ్రంథాన్నీ చేరబోతోంది.. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి..” “ఈ దునియాలో ఏదీ నీది కాదు భయ్యా.. అన్నీ అప్పే.. ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర..” అనే మాటలు సినిమా కంటెంట్‌పై భారీ ఆసక్తిని రేకెత్తించాయి.

ముఖ్యంగా, పురాణాల ప్రకారం అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో తొమ్మిది పవిత్ర గ్రంథాలను సృష్టించాడు అన్న నేపథ్యం ఆధారంగా కథ సాగుతోంది. ఈ గ్రంథాలను కాపాడే సూపర్ యోధుడిగా తేజ సజ్జా కనిపించబోతుండగా, జగపతి బాబు, మంచు మనోజ్ విలన్ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ట్రైలర్‌తోనే ‘మిరాయ్’పై హైప్ మాక్స్ లెవెల్‌కు చేరింది.

Leave a Reply