Mirai BOX Office Collections: ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ.. రెండు రోజుల్లోనే బ్రేక్-ఈవెన్!

సూపర్ హీరో తేజ సజ్జ – కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ఈ నెల 12న థియేటర్స్‌లో విడుదలైన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రారంభించింది. సూపర్ హిట్ రెస్పాన్స్ తో ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹55.60 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లలో గణనీయమైన పెరుగుదల కనిపించగా, ఇది సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి మరియు విజయాన్ని సూచిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు (శుక్రవారం) ₹27.2 కోట్లు, రెండో రోజు ₹28 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఇండియాలో కేవలం మొదటి రోజు ₹13 కోట్లు (నెట్) వసూలు అయ్యాయి. ఇందులో తెలుగు వెర్షన్ ₹11 కోట్లు వసూలు చేయగా, హిందీ వెర్షన్ ₹1.65 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు దేశవ్యాప్తంగా ₹14.5 కోట్లు వసూలు కాగా, ఇది మొదటి రోజు వసూలు చేసిన మొత్తం కంటే 11.5% ఎక్కువ. తెలుగు వెర్షన్ వసూళ్లలో స్థిరత్వం కనిపించగా, హిందీ వెర్షన్ వసూళ్లలో పెరుగుదల నమోదైంది. మొదటి రోజు ₹1.65 కోట్లు వసూలు చేసిన హిందీ వెర్షన్ రెండో రోజు ₹2.8 కోట్లుకి చేరి మొత్తం ₹4.45 కోట్లు అయింది. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ట్రేడ్ నిపుణులు, ఆదివారం వసూళ్లతో ఈ వారాంతంలోనే మిరాయ్ అన్ని ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సినిమా అశోకుని కాలం నాటి తొమ్మిది అతీత శక్తులు కలిగిన గ్రంథాల కథా నేపథ్యంతో రూపొందించబడింది. అడ్వెంచర్, యాక్షన్, డివోషన్, ఎలివేషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్స్, గౌరీ హరి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి. కథలో కంటెంట్ మాత్రమే కాకుండా, టెక్నీకల్ అంశాలు కూడా మెప్పిస్తున్నాయి.

సినిమాలో తేజ సజ్జ అతీత శక్తులు కలిగిన గ్రంథాలను కాపాడే యోధుడిగా నటించగా, మంచు మనోజ్ వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించే దుష్ట శక్తిగా కనిపించారు.

Leave a Reply