Vishwambhara Story: ‘విశ్వంభర’ స్టోరీ ఇదే.. మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ గ్యారంటీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ గురించి దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కథ 14 లోకాలకు కూడా అవతల ఉన్న విశ్వంభర లోకం నుండి భూమికి వచ్చిన హీరోయిన్ (త్రిష)ను, తిరిగి ఆ లోకానికి తీసుకెళ్లే హీరో (చిరంజీవి) ప్రయాణం చుట్టూ తిరుగుతుందని తెలిపారు.

దర్శకుడు వశిష్ఠ చెప్పిన ప్రకారం.. మనకు తెలిసినవి 14 లోకాలు. అందులో 7 పైన, 7 కింద ఉంటాయి. కానీ విశ్వంభర అనేది ఈ 14 లోకాలకు కూడా పైన ఉన్న మరో అద్భుతమైన లోకం. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష ఆ లోకానికి చెందినది. ఏదో కారణంతో భూమికి వస్తుంది. భూమి మీదకి వచ్చిన ఆమెను తిరిగి విశ్వంభరలోకానికి ఎలా తీసుకెళ్లారు? ఈ ప్రయాణంలో చిరంజీవి ఎలా సవాళ్లను ఎదుర్కొన్నారు? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని వశిష్ఠ వివరించారు.

ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం కూడా దర్శకుడు స్పష్టంచేశారు. ఈ చిత్రంలో 4676 VFX షాట్లు ఉండటమే ప్రధాన కారణం అని చెప్పారు. ఇండియన్ సినిమాల్లో ఇంత భారీ స్థాయిలో VFX వర్క్ జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రపంచ స్థాయి VFX కంపెనీలు కలిసి పని చేస్తుండటంతో, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ అనుభూతి అందుతుందని హామీ ఇచ్చారు.

‘విశ్వంభర’ కోసం ప్రత్యేకంగా 13 భారీ సెట్‌లు నిర్మించారని, ఒక్కో సెట్ కూడా కథలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలు గుర్రం’, ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’ వంటి పాత ఫాంటసీ సినిమాల నుండి తాను ప్రేరణ పొందినట్లు వశిష్ఠ తెలిపారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఒక పాట మాత్రమే బ్యాలెన్స్‌లో ఉందని తెలిపారు. మెగా ఫ్యాన్స్ ఈ అప్‌డేట్ విన్న తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగిపోయింది.

Leave a Reply