సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన క్లాసిక్ హిట్ ‘అతడు’ (2005) మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9)ను పురస్కరించుకుని ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రీ రిలీజ్ ఎప్పుడో ఉండకముందే అడ్వాన్స్ బుకింగ్స్ హవా చూపిస్తోంది.
పోకిరితో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు మహేష్ బాబుతో మళ్లీ ఊపందుకుంది. గతంలో విజయం సాధించిన సినిమాలను మళ్లీ స్క్రీన్ పై చూడాలనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని సుదర్శన్ 35mm, దేవి 70mm వంటి థియేటర్లలో ఆగస్టు 9కి షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి.
#Athadu Re Release Booking’s Open Now In Ongole !
Visit @bookmyshow pic.twitter.com/OofESCkMFF
— Ongole Movies (@OngoleMovies) August 2, 2025
ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్లో ‘అతడు’కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ రావడంతో ఈ రీ-రిలీజ్‌కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అంతేకాదు, రీ రిలీజ్ హక్కుల విషయంలో కూడా ఈ సినిమాకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. నైజాం ఏరియాలో హక్కులను ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకోగా, ఏపీలో ఏరియాల వారీగా భారీ ధరలకు హక్కులు విక్రయమైనట్లు సమాచారం.
సినీ వర్గాల నివేదికల ప్రకారం, ఈ రీ రిలీజ్ హక్కులు రూ. 3 కోట్లకు పైగా పలికినట్లు తెలుస్తోంది. ఒక రీ రిలీజ్ సినిమా కోసం ఇంత ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీలో అరుదైన ఘటన. గతంలో రీ రిలీజ్ అయిన ఒక్కడు, మురారి, ఖలేజా కంటే ఈసారి ‘అతడు’ ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశముంది.
ఇదంతా చూస్తుంటే, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి నిజమైన ఫ్యాన్స్ ఫెస్టివల్‌నే మేకర్స్ అందించబోతున్నారని చెప్పొచ్చు.