HBD King Nagarjuna : కింగ్ నాగార్జున సినీ ప్రయాణం.. బర్త్ డే స్పెషల్ స్టోరీ

ఏళ్ళు గడిచినా తరగని అందం, అద్భుతమైన చరిష్మా ఆయన సొంతం! మాస్, క్లాస్, రొమాంటిక్, భక్తిరస పాత్రలు.. ఏ రోల్ అయినా తాను మాస్టర్ అని నిరూపించుకున్న నటుడు నాగార్జున. విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల మది గెలుచుకున్న ఆయన, ప్రతి సినిమాలో కొత్తదనం కోసం శ్రమించారు.

”శివ”లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా, ”అన్నమయ్య”లో భక్తుడిగా, ”గీతాంజలి”లో ప్రేమికుడిగా, ”మన్మధుడు”లో లవర్ బాయ్‌గా, ”సైమన్”లో ప్రతినాయకుడిగా తన నటనతో ఆకట్టుకున్నారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వెండితెరకు వచ్చినా, తనదైన స్టైల్‌తో ఎవరూ చేరని ముద్ర వేశారు కింగ్ నాగార్జున.

నాగార్జున సినీ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. 1986లో ‘విక్రమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నా, తర్వాత కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ విజయం సాధించగా, 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఇదే సినిమా నాగార్జునకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

‘మౌనరాగం’ సినిమా చూసిన నాగార్జున, ఎలాగైనా మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. నెలరోజులు ప్రతిరోజూ ఆయన వాకింగ్‌కి వచ్చే పార్క్‌కి వెళ్లి, చివరికి ఒప్పించి ‘గీతాంజలి’ సినిమా చేయించుకున్నారు.

‘గీతాంజలి’ తర్వాత వచ్చిన ఆర్జీవీ దర్శకత్వంలోని ‘శివ’ తెలుగు సినిమాకి కొత్త ట్రెండ్‌ని తెచ్చింది. ఇది యాక్షన్ సినిమాలకి కొత్త దారిని చూపింది. ఆ తర్వాత ‘హలో బ్రదర్’, ‘ఘరానా బుల్లోడు’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘మన్మధుడు’ వంటి సినిమాలతో మాస్, క్లాస్, కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు.

గ్లామర్ రోల్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో భక్తిరసాన్ని పండించి ప్రేక్షకులను అలరించారు. ఈ పాత్రలతో ఆయనకి జాతీయస్థాయి గుర్తింపు కూడా లభించింది.

1987, 1990, 1991లో నాగార్జున ఒకే ఏడాదిలో 5-6 సినిమాలు రిలీజ్ చేయించి అరుదైన రికార్డు సృష్టించారు.

కింగ్ నాగార్జున సినీ ప్రయాణం అంటే కేవలం సినిమాలు కాదు, కొత్త ప్రయోగాల పట్ల ఆయనకున్న పట్టుదల.. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా సినీ ప్రపంచం మరోసారి ఆయన కెరీర్‌ని గుర్తు చేసుకుంటోంది.

Leave a Reply