ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత..!

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత, గేయరచయిత శివశక్తి దత్త (92) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినిమా పాటల రచనలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

శివశక్తి దత్త అసలుపేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం జిల్లాలోని కొవ్వూరులో జన్మించారు. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈయన సోదరుడు కావడం గమనార్హం.

చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయిన దత్త, ముంబై వెళ్లి ఆర్ట్స్ కాలేజీలో విద్యనభ్యసించారు. అనంతరం కొవ్వూరులో “కమలేశ్” అనే కలం పేరుతో చిత్రకారుడిగా పని చేశారు. సంగీతంపై ఉన్న మక్కువతో గిటార్, సితార, హార్మోనియం వంటి వాద్యాలు నేర్చుకున్నారు. అనంతరం సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మద్రాస్‌కు వెళ్లి సినీరంగంలో అడుగుపెట్టారు.

1988లో విడుదలైన ‘జానకిరాముడు’ సినిమాకు స్క్రీన్‌రైటర్‌గా పనిచేసిన దత్తకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన రచించిన పాటలు బాహుబలి 1, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్‌, హనుమాన్‌, ఛత్రపతి, సై, రాజన్న, ఎన్టీఆర్: కథానాయకుడు వంటి చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఆయన కలం నుంచి వచ్చిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

Leave a Reply