Darshan : జైల్లో కష్టాల బాధతో కన్నడ స్టార్ దర్శన్.. ‘నన్ను చంపేయండి’

కన్నడ నటుడు దర్శన్ బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గదిలో దుర్వాసన, ఫంగస్ కారణంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇక్కడ ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్ అని తెలిపారు. రేణుకాస్వామి హత్యకేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్‌, సెషన్స్ కోర్ట్ ముందు తన పరిస్థితులను వివరించారు.

“గదిలో గాలి కూడా ఆడడం లేదు. సూర్యుడిని చూసి చాలా రోజులు అయ్యింది. బట్టలతో సహా దుర్వాసన వస్తోంది. ఫంగస్ తీవ్రత భయపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బతకడం చాలా కష్టంగా ఉంది. నాకు విషమివ్వండి, జైలు జీవితం అత్యంత దుర్భరంగా ఉంది.”

రేణుకాస్వామి హత్యకేసులో సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. చట్టపరమైన కారణాలు లేకుండా దర్శన్‌కు బెయిల్ ఇవ్వలేమని, అతడిని త్వరగా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది, “జైల్లో నిందితులకు స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. నియమాలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవు.”

దర్శన్ తన సన్నిహితురాలు నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిన కోపంతో రేణుకాస్వామి అనే అభిమానిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. ఈ ఘటన కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది.

గతేడాది డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేసింది. సుప్రీం కోర్టు అభిప్రాయం ప్రకారం, ఈ కేసు తీవ్రమైనది మరియు బెయిల్ ఇవ్వడం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కలిగించవచ్చు.

Leave a Reply