Ram Pothineni: హీరో రామ్ పై దాడి యత్నం..? అర్థరాత్రి బెడ్‌రూమ్ తలుపులు కొట్టిన దుండగులు!

తెలుగు యువ కథానాయకుడు రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న తన కొత్త చిత్రం ‘ఆంధ్ర కింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే నిన్న అర్థరాత్రి ఆయన నివాసం ఉన్న హోటల్‌లో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రామ్ ఉండే వీఐపీ సూట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు హోటల్ రిసెప్షన్ వద్దకు వచ్చి తామూ రామ్ టీమ్ సభ్యులమని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఆరో అంతస్తులోని రామ్ వీఐపీ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ యాక్సెస్ కోరారు. వారి మాటలు నమ్మిన హోటల్ సిబ్బంది వారికి యాక్సెస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతటితో ఆగకుండా.. హౌస్ కీపింగ్‌ను మాయ మాటలతో ముంచి, మాస్టర్ కీ సంపాదించి రామ్ సూట్‌లోకి ప్రవేశించారు. అయితే అదృష్టవశాత్తూ, రామ్ సూట్‌లోని ఇంకొక బెడ్‌రూమ్‌లో తలుపు వేసుకుని నిద్రించడమే పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

గట్టిగా తలుపులు కొట్టిన శబ్దంతో రామ్‌ నిద్రలేచి అప్రమత్తమయ్యారు. వెంటనే తన టీమ్‌కు సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా షూటింగ్ యూనిట్, హోటల్ సిబ్బంది హుటాహుటిన రియాక్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని ఘటనా స్థలానికి పిలిపించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా సమాచారం ప్రకారం, వారు మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అసలు వారు ఎవరు..? ఏ ఉద్దేశంతో వచ్చారు..? అన్నది పూర్తి దర్యాప్తు తరువాతే బయటపడనుంది.

Leave a Reply