నాలుగేళ్ల నిరీక్షణకు తెరదింపుగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను, ఆ తర్వాత జ్యోతికృష్ణ టేకోవర్ చేసి పూర్తిచేశారు. రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రంలోని హైలైట్స్, మేకింగ్ విశేషాలు ఒకసారి చూద్దాం.
పీరియడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సెట్స్‌నే ముఖ్య హైలైట్‌గా నిలబెట్టారు. ముఖ్యంగా దర్బార్ పోర్ట్, మచిలీపట్నం బందర్ పోర్ట్, చార్మినార్ సెట్స్ కోసం భారీ ఖర్చు చేశారు. నిజమైన చార్మినార్ ఎంత ఎత్తులో ఉంటుందో, అదే హైట్‌లో సెట్‌ను నిర్మించారు. ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ఆధ్వర్యంలో మొఘల్ కాలం నాటి రాజభవనాలు, యుద్ధభూములు, ప్రాచీన నగరాలు, దేవాలయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు సెట్స్‌ను శ్రద్ధగా డిజైన్ చేశారు.
హై ఎండ్ సినిమాటిక్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు ₹250 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఈ బడ్జెట్‌ను బ్రేక్ ఈవెన్ చేయాలంటే, ప్రపంచవ్యాప్తంగా కనీసం ₹127 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
క్లైమాక్స్‌లో పవన్ కొరియోగ్రాఫ్ చేసిన 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పారు. ఈ ఒక్క సన్నివేశం కోసం ఏకంగా 57 రోజుల పాటు షూటింగ్ కొనసాగిందట. పవన్ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో స్వయంగా కొరియోగ్రఫీ చేశారు.
వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక లుక్, ఫిట్‌నెస్‌పై పెట్టిన శ్రద్ధ అభిమానులను ఆకట్టుకోనుంది. ఇక ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమాకు మరో లెవల్‌లో ఎనర్జీ ఇవ్వబోతున్నాయి.
ఇది పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. అయితే కోవిడ్ మహమ్మారి, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఎన్నో సార్లు వాయిదా పడింది. అయినప్పటికీ నిర్మాత ఏ.ఎం. రత్నం, దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ పట్టుదలతో పూర్తి చేశారు.