గుత్తాజ్వాల-విష్ణు విశాల్‌కు పండంటి పాప.. 4వ వివాహ వార్షికోత్సవం రోజున శుభవార్త!

స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ తమ అభిమానులకు ఒక శుభవార్త ను ప్రకటించారు. ఈ జంట తాజాగా సోషల్‌ మీడియా ద్వారా గుడ్‌ న్యూస్‌ను పంచుకుంది. గుత్తాజ్వాల ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని, ఈ సంతోషకరమైన విషయం విష్ణు విశాల్‌ ఎక్స్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ రోజు తమ 4వ వివాహ వార్షికోత్సవం అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ రోజు తన జీవితంలో మరొక అద్భుతమైన బహుమతిని అందుకున్నట్టు విష్ణు విశాల్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

విష్ణు విశాల్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు, “మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఈ రోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు.” ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది, దీనిపై అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు గుత్తా జ్వాలా మరియు విష్ణు విశాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గుత్తాజ్వాల గతంలో 2005లో బ్యాడ్మింటన్‌ కోచ్‌ చేతన్‌ ఆనంద్‌తో ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తన కెరీర్‌పై దృష్టిపెట్టి, 2021 ఏప్రిల్‌ 22న తమిళ నటుడు విష్ణు విశాల్‌ తో వివాహం చేసుకున్నారు. ఇంతకుముందు విష్ణు విశాల్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో పెళ్లి చేసుకుని, 2018లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు ఆర్యన్‌ ఉన్నాడు. ప్రస్తుతం ఆర్యన్‌ విష్ణు విశాల్‌ దగ్గరే పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply