ఇటీవల చర్చనీయాంశంగా మారిన L2 – ఎంపురాన్ సినిమాకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ కంపెనీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించగా, రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
తమిళనాడు, కేరళల్లో గోకులం గ్రూప్ కార్యాలయాల్లో రెండు రోజుల పాటు ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోకులం గోపాలన్‌కు చెందిన శ్రీ గోపాలన్ చిట్ & ఫైనాన్స్ కో లిమిటెడ్ అనే చిట్ ఫండ్ కంపెనీలో ఆర్థిక అవకతవకలపై ఫెమా చట్టం కింద ఈ కేసును నమోదు చేశారు. ఈ దర్యాప్తు మొత్తం దాదాపు రూ.1000 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్య లావాదేవీలపై కొనసాగుతోంది.
గోకులం సంస్థకు తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇదే సంస్థపై 2017లో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రూ.1100 కోట్లకు పైగా ఆదాయాన్ని వెలిబుచ్చకపోవడం వల్ల పెద్ద మొత్తంలో పన్ను ఎగవేత జరిగిందని ఆరోపించారు.
సినిమా నే టార్గెట్ చేస్తున్నారా?
ఈ కేసు వెనుక రాజకీయ కోణముందని కేరళలో ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. గోపాలన్ ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించినందుకే కేంద్రం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని LDF, UDF పార్టీలూ ఆరోపిస్తున్నాయి. ఎంపురాన్ సినిమాలో గుజరాత్ అల్లర్లకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉండటంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై చిత్ర బృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పి వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తామని వెల్లడించింది.
అయితే, ఈ విషయాన్ని చలనచిత్ర రంగంపై చేసే దాడిగా అభివర్ణిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు గోకులం గోపాలన్‌కు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంపై కళాత్మక, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.