Jagga Reddy: ఉగాదికి జగ్గారెడ్డి సూపర్ అనౌన్స్‌మెంట్.. ‘వార్ ఆఫ్ లవ్’ సినిమా గ్రాండ్ లాంచ్!

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నుంచి ఉగాది పండుగకు భారీ అప్డేట్ వచ్చింది. ఆయన స్వంతంగా నిర్మించబోయే ‘జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమాకి సంబంధించి, కొత్త ఆఫీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో సినిమా ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్న జగ్గారెడ్డి, ఉగాది రోజున ఉదయం 11 గంటలకు దీన్ని గ్రాండ్ లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమాను తానే నిర్మించడమే కాకుండా, కీలక పాత్రలో నటించబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఉగాది నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్వెల్‌కు ముందు జగ్గారెడ్డి పాత్ర ఎంట్రీ ఇవ్వనుండగా, సినిమా పూర్తయ్యే వరకు ఆయన పాత్ర కొనసాగుతుందని సమాచారం.

ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సినీ, రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

ఇక సినిమా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, తాను విద్యార్థి నాయకుడిగా మొదలుకుని కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్‌గా ఎదిగిన క్రమాన్ని సినిమాలో కొన్ని సందర్భాల్లో చూపించనున్నట్లు వెల్లడించారు. లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్, పొలిటికల్ డ్రామా ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని తెలిపారు.

సినిమా కథ, నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఉగాదికి గ్రాండ్ లాంచ్ కానున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో ఏ మేరకు ఆసక్తిని పెంచుతుందో వేచి చూడాలి!

Leave a Reply