Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం – బ్రిడ్జ్ ఇండియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. సినీరంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా, ఇప్పటికే పద్మ విభూషణ్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న చిరంజీవి, ఇప్పుడు అంతర్జాతీయంగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోనున్నారు. ‘నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్‌’ అన్న చిరంజీవి డైలాగ్ ఈ సందర్భానికి అచ్చంగా సరిపోతుంది.

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవిని యూకే పార్లమెంట్‌లో గౌరవించనున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి, సమాజానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా, యూకే అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు నవేందు మిశ్రా ప్రత్యేకంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 19న జరగనుంది. కార్యక్రమంలో సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నారు.

ఈ వేడుకలో చిరంజీవికి ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్’ ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును ప్రముఖ సంస్థ బ్రిడ్జ్ ఇండియా అందించనుంది. బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ప్రఖ్యాత సంస్థ. ప్రజా విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సంస్థ, కళారంగం, ప్రజాసేవ, దాతృత్వం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తుంది.

ఇదే తొలి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్. చిరంజీవి ఈ గౌరవాన్ని అందుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. ఆయనకు ఈ అవార్డ్ దక్కడం, మెగాస్టార్ కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్న ఈ అరుదైన గౌరవం తెలుగు సినీ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

Leave a Reply