ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు యాడ్స్ విషయంలో ఆలోచించి వెనకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు మాత్రం ఆలోచించకుండా ఒప్పుకోరు. కారణం.. యాడ్స్ రూపంలో జరిగే వివాదాలు, కేసులు, నిందలు.
సినీ ఇండస్ట్రీలో యాడ్స్ ఓ చక్కటి ఆదాయ మార్గం. కేవలం కొన్ని గంటల షూటింగ్‌తో లక్షల నుంచి కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. చాలా మంది హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ తమ ఇమేజ్‌ను కమర్షియల్‌గా వాడుకుంటున్నారు. కానీ ఇటీవలి కొన్ని సంఘటనలు వాళ్లను హై అలర్ట్‌లోకి నెట్టాయి.
తాజాగా మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సాయి సూర్య డెవలపర్స్ పేరుతో ఈడీ నోటీసులు జారీ కావడంతో సంచలనం రేగింది. హవాలా ఆరోపణలతో పాటు, ప్రజలు మోసపోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మహేష్‌పై కూడా నెటిజన్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసినందుకే ఓ స్టార్ ఇబ్బందుల్లో పడితే, మిగతా వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక అల్లు అర్జున్, శ్రీలీలలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదులు జరుగుతున్నాయి. వీరి ప్రమోషన్లు కూడా వివాదంగా మారుతుండటంతో నటీనటులు మరింత జాగ్రత్తపడుతున్నారు.
పాన్ మషాలా యాడ్స్, లాటరీ యాడ్స్, హెల్త్ ప్రొడక్ట్స్ యాడ్స్.. ఇలా కొన్ని యాడ్స్ సెలబ్రిటీల పేరుకు భంగం తీసుకొస్తున్నాయనేది పరిశీలనీయమైన అంశం. కొన్ని రోజుల క్రితం యాంకర్ సుమ చేసిన యాడ్ కూడా వివాదంలో చిక్కుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో నటి సమంత ఇప్పటికే తనకు వచ్చిన దాదాపు 15 యాడ్ డీల్‌లను వదులుకున్నట్టు సమాచారం. ‘‘ప్రతీ యాడ్ వెనుక కంటెంట్ ఏంటి, బ్రాండ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది తెలుసుకుని, అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి’’ అన్న జాగ్రత్తతో సమంత ముందుకెళ్తున్నట్టు సమాచారం.
ఇలా ఇప్పుడు టాలీవుడ్‌లో సెలబ్రిటీలు యాడ్స్ విషయంలో ఏకంగా ‘రెడ్ సిగ్నల్’ ఇవ్వడం మొదలెట్టారు. కొంతమంది అయితే ‘‘ఈ తలనొప్పులు ఎందుకు..’’ అని పూర్తిగా యాడ్స్ ను పక్కకి పెట్టేస్తున్నారు.