టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వివాదాల కి కేంద్రబిందువుగా ఉన్నారు. ఇప్పటికే ‘పుష్ప-2’ ప్రమోషన్ సమయంలో జరిగిన సంఘటనలో కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై తాజాగా మరో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) ఆ ఫిర్యాదును పోలీసులకు అందించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ శ్రీలీల పేరు కూడా ప్రస్తావించబడింది.
AISF ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, అల్లు అర్జున్, శ్రీలీల కొంతమంది కార్పొరేట్ కళాశాలల బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయా కళాశాలల విద్యా ప్రమాణాలు, విద్యా విధానాలు పూర్తిగా తెలుసుకోకుండా, తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రకటనల వల్ల లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టే అవకాశముందని తెలిపారు.
అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పుడు ప్రకటనలపై విచారణ ప్రారంభించాలనీ AISF పోలీసులను కోరింది.
ఈ ఫిర్యాదు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా తారలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే సందర్భాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మళ్ళీ హైలైట్ చేస్తోంది. వారు ప్రోత్సహించే విద్యా సంస్థల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండకపోతే, అమాయకులైన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ ఇప్పటికే ఒక కేసులో బెయిల్‌పై బయట ఉన్నారు. ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఆయన హఠాత్తుగా సందర్శన చేయడం వల్ల భారీ గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఓ చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు కాగా, అర్జున్ ఒకరోజు జైలులో గడపాల్సి వచ్చింది.
ఈ తరహా సంఘటనల నేపథ్యంలో సెలబ్రిటీలు బ్రాండ్ ప్రచారంలోకి దిగే ముందు తమ బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నదో మరొకసారి స్పష్టమవుతోంది. అల్లు అర్జున్, శ్రీలీల ఈ కొత్త ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి!