Mukul Dev Dies at 54: ‘కృష్ణ’ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత.. బాలీవుడ్, టాలీవుడ్‌కి తీరని లోటు

ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన, మే 24న తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ముకుల్ దేవ్, నటుడిగా, విలన్‌గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

తెలుగు ప్రేక్షకులకు రవితేజ నటించిన ‘కృష్ణ’ సినిమాలో విలన్ పాత్ర ద్వారా బాగా గుర్తుండిపోయిన ముకుల్, ‘ఏక్ నిరంజన్’, ‘కేడీ’, ‘అదుర్స్’ వంటి చిత్రాల్లోనూ తన శక్తివంచనలేని నటనతో ఆకట్టుకున్నారు. ఆయన ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ సోదరుడు కావడం విశేషం.

ముకుల్ దేవ్ బాలీవుడ్‌తో పాటు పంజాబీ, బెంగాలీ, మళయాలం, కన్నడ భాషల్లోనూ పనిచేసారు. టీవీ సీరియల్స్‌, మ్యూజిక్ ఆల్బమ్స్‌, వెబ్ కంటెంట్‌ ద్వారా కూడా అభిమానులను సంపాదించారు. 1996లో ‘మమ్కిన్’ అనే టీవీ సీరియల్‌లో విజయ్ పాండే పాత్రతో నటన ప్రారంభించిన ముకుల్, ‘ఏక్ సే భాద్ కర్ ఏక్’ (దూరదర్శన్), ‘దస్తక్’ (సుస్మితా సేన్ సరసన) వంటి ప్రాజెక్ట్స్‌తో బాగా పాపులర్ అయ్యారు.

అలాగే ‘కిలా’, ‘వజూద్’, ‘కొహ్రాం’, ‘ముఝే మేరీ బీవీ సే బచావో’ వంటి హిందీ చిత్రాల్లో కూడా ముకుల్ దేవ్ తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘యమ్లా పగ్లా దీవానా’ చిత్రానికి ఆయనకు అమ్రీష్ పూరి అవార్డు లభించింది. ముకుల్ దేవ్ మృతితో భారత సినిమా పరిశ్రమ మరో మంచి నటుడిని కోల్పోయింది.

Leave a Reply