సినిమాల్లో హీరోగా కనిపించినా, నిజజీవితంలో మాత్రం భార్యకే విలన్‌గా మారాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నటుడు ధర్మ మహేశ్. సినిమా అవకాశాలు పెరగడంతో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడిన అతడు, అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ధర్మ మహేశ్ ‘సిందూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్లో అతని మీద కేసు నమోదైంది. గతంలో కూడా వరకట్న వేధింపుల కేసుతో సంబంధం ఉన్నందున పోలీసుల కౌన్సిలింగ్ పొందినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని బాధితురాలు తెలిపింది.
వ్యక్తిగత జీవితం:
ధర్మ మహేశ్ అసలు పేరు కాకాని ధర్మసత్య సాయి శ్రీనివాస మహేశ్ (30). మాదాపూర్‌లోని ఫార్చ్యూన్ టవర్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి (31)తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది. 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమి, ఆమె కుటుంబ ఆర్థిక సహకారంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.
అయితే, సినిమా అవకాశాలు పెరగడంతో ధర్మ మహేశ్ యువతులతో తిరుగుతూ భార్యను వేధించడం మొదలుపెట్టాడని గౌతమి ఆరోపించింది. తన స్టేటస్ పెరిగిందని చెప్పి అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నాడని, అంతేకాక గౌతమి డబ్బుతో స్థాపించిన హోటల్ ఫ్రాంచైజీని కూడా తన పేరుమీదకు మార్చుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసు కేసు వివరాలు:
ధర్మ మహేశ్, అతని కుటుంబ సభ్యులపై శారీరక, మానసిక వేధింపుల ఆరోపణలతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో బి.ఎన్.ఎస్ సెక్షన్ 85, 115(2), 316(2), 351(2), 352, అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ (DP Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.