గ్రూప్స్ అభ్యర్థులకు షాక్.. TGPSC ప్రశ్నాపత్రాల్లో భారీ మార్పులు.. సిలబస్ మరింత కఠినం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఇకపై మరింత కఠినతరంగా మారనున్నాయి. సంప్రదాయ మోడల్‌కు బై చెప్పి, అభ్యర్థుల అనేక నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నాపత్రాలను రూపొందించాలనే ఆలోచనతో టీజిపీఎస్సీ ముందడుగు వేసింది.

ప్రశ్నాపత్రాల్లో కీలక మార్పులకు ఆరంభం
TGPSC ఇప్పటికే ఈ మార్పులపై విద్యా నిపుణులతో, వర్సిటీ వైస్ చాన్సలర్లతో కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో సిలబస్, పరీక్షా విధానం, మూల్యాంకన విధానాలు, తెలంగాణ చరిత్ర ప్రాముఖ్యత వంటి అంశాలపై లోతుగా చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో ప్రశ్నల నమూనాలను అధ్యయనం చేసి, ఓ పెద్ద ప్రశ్నల బ్యాంక్‌ను సిద్ధం చేయాలన్నది కమిషన్ ఉద్దేశం. నెల రోజుల్లో వీసీల నివేదికను ప్రభుత్వం ముందు ఉంచాలని నిర్ణయం తీసింది.

మూడు విభాగాలుగా ప్రశ్నలు – ఆర్ట్స్ అభ్యర్థులకు కఠిన పరీక్ష
ఇప్పటివరకు గ్రూప్స్ పరీక్షల ప్రశ్నలు ఒకే మాదిరిగా ఉండేవి. ఇకపై వాటిని మూడు విభాగాలుగా విభజించి, అభ్యర్థుల నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉండనున్నాయి. ప్రత్యేకంగా ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే అభ్యర్థులకు సంబంధించి కొత్త ప్రశ్నల మోడల్ రూపొందించనున్నారు. వర్సిటీల నిపుణులతో ప్రత్యేక ప్యానల్ ఏర్పాటు చేయబోతున్నారు.

AI ఆధారిత ప్రశ్నలుకు ప్రాధాన్యం
ప్రపంచమంతా AI ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో… తాజా ఉద్యోగులకు టెక్నాలజీపై అవగాహన అవసరమని భావిస్తోంది TGPSC. అందుకే సిలబస్‌లో ఐటీ, డేటా అనలిటిక్స్, AI తదితర అంశాలకు స్థానం కల్పించనున్నారు. అంతర్జాతీయ టెక్నాలజీ లాంగ్వేజ్ ఆధారంగా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అంతేకాదు, తెలంగాణ చరిత్ర కంటే, తెలంగాణ సమాజ, సంస్కృతి పై ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇంటర్వ్యూలు మళ్లీ రాబోతున్నాయా?
2022లో గ్రూప్-1 ఇంటర్వ్యూలను రద్దు చేసిన ప్రభుత్వం, ఆ విధానం పట్ల అనేక విమర్శలు ఎదుర్కొంది. అయితే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంటర్వ్యూలు కొనసాగుతుండటంతో, తెలంగాణలోనూ మళ్లీ ఈ పద్ధతిని పునరుద్ధరించాలన్న చర్చలు జరుగుతున్నాయి. పారదర్శకతతో నియామకాలు జరిపేందుకు ఇది అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply