SBI Recruitment: SBIలో క్లర్క్ ఉద్యోగాలకు శుభవార్త! నెలకు ₹60,000 జీతంతో భర్తీకి భారీ నోటిఫికేషన్..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లరికల్ క్యాడర్‌లోని జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6589 ఖాళీల్లో 5180 రెగ్యులర్, 1409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ ఖాళీల్లో అన్‌రిజర్వ్డ్‌కి 2255, ఎస్సీకి 788, ఎస్టీకి 450, ఓబీసీకి 1179, ఈడబ్ల్యూఎస్‌కు 508 పోస్టులు కేటాయించారు.

ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ అయిన sbi.co.in లోకు వెళ్లి ఆగస్టు 26లోగా అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్‌లో, మెయిన్స్ పరీక్ష నవంబర్‌లో నిర్వహించనున్నారు.

అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ ఏడాది డిసెంబర్ 21లోగా డిగ్రీ పూర్తయ్యి ఉండాలి. వయోపరిమితి 20–28 ఏళ్ల మధ్య. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.

జూనియర్ అసోసియేట్ పోస్టులకు ప్రారంభవేతనం రూ.26,730 కాగా, అనుభవం పెరిగేకొద్దీ జీతం నెలకు రూ.60,000 వరకూ పెరుగుతుంది. మొదట ప్రిలిమ్స్ ఆన్‌లైన్ పరీక్ష, ఆపై మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. తప్పు సమాధానాలకు కొంత మార్కుల కోత ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు లేదు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఇతరుల కోసం రూ.750గా నిర్ణయించారు.

సెప్టెంబర్ పరీక్షలకు వారం లేదా పది రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో సమస్యలు వస్తే లేదా సందేహాలుంటే http://cgrs.ibps.in వెబ్‌సైట్ ద్వారా సమాచారం పొందొచ్చు.

అర్హులు అయిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని SBI సూచిస్తోంది.

Leave a Reply