పిల్లలు తొలిసారి పాఠశాలకు అడుగుపెడతారు అంటే అది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో మరచిపోలేని మధుర క్షణం. అయితే ఆ రోజు పిల్లలకు కొత్తదనం తో పాటు కొంత భయం కూడా కలుగుతుంది. చిన్న వయస్సులో కొత్త ప్రదేశం, కొత్త వ్యక్తులు, ఉపాధ్యాయులు అన్నీ కొత్తగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో ముందుగానే కొన్ని ముఖ్య విషయాలు నేర్పితే పిల్లలు ధైర్యంగా, సులభంగా కొత్త వాతావరణానికి తగలిపోతారు.
పలకరింపులు, పరిచయాలపై అవగాహన ఇవ్వండి
పాఠశాలలో టీచర్లు, మిగతా పిల్లలతో కలిసినప్పుడు చిరునవ్వుతో “హలో” అని పలకరించడం మంచి అలవాటు అని పిల్లలకు ముందుగానే వివరించాలి. ఇది వారిలో నమ్మకాన్ని పెంపొందించడమే కాక, పరిచయం లేని వారితో స్నేహంగా మెలగే ధైర్యాన్ని కూడా కలుగజేస్తుంది.
తమ అవసరాలు చెప్పడం ఎలా?
బాత్రూమ్‌కు వెళ్లాలనిపించినా, ఆకలి వేసినా, దాహంగా ఉన్నా.. ఈ విషయాలను టీచర్‌కి ఎలా చెప్పాలో పిల్లలకు నేర్పాలి. ఈ అలవాటు వల్ల వారు తమ సమస్యలు చెప్పగలుగుతారు, భయపడరు. ఉపాధ్యాయుల సాయంతో తగిన పరిష్కారం పొందగలుగుతారు.
స్వయం సహాయక పనులు నేర్పించండి
టిఫిన్ బాక్స్ తెరవడం, తినడం, నీటి బాటిల్ తాగే పనులు పిల్లలు తమకు తాము చేయగలగాలి. ఈ స్వతంత్రత వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఏదైనా సహాయం అవసరమైనప్పుడు టీచర్‌కి భయపడకుండా చెప్పాలని ముందే చెప్పండి.
వస్తువుల నిర్వహణపై దృష్టి పెట్టండి
స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్, బాటిల్ వంటి వస్తువులను ఎలా ఉంచాలో, ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. ఏ వస్తువు కనబడకపోతే వెంటనే ఉపాధ్యాయునికి తెలియజేయమని సూచించండి. ఇది బాధ్యత గల పౌరుడిగా మారే తొలి అడుగు అవుతుంది.
వాళ్లకు భద్రతగా ఉన్నారన్న నమ్మకం ఇవ్వండి
పాఠశాల పూర్తయ్యాక తల్లిదండ్రులు వస్తారని చెప్పి భరోసా కలిగించండి. “నిన్ను సరిగ్గా సమయానికి తీసుకెళ్తాం” అనే నమ్మకం పిల్లల్లో భద్రతా భావాన్ని పెంచుతుంది. ఉదయం వారిని స్కూల్‌కి పంపేటప్పుడు ప్రేమతో మాట్లాడితే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈ చిట్కాలు పాటిస్తే, పిల్లల మొదటి స్కూల్ అనుభవం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కొత్త వాతావరణం పట్ల ఆసక్తి పెరుగుతుంది, భయాన్ని జయించి నేర్చుకోవడంలో ఆనందం పొందగలుగుతారు. చిన్నారుల ఎదుగుదలలో తల్లితండ్రుల పాత్ర ఎంతో కీలకం.