ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు కీలక రోజు వచ్చేసింది. ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12 (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
ఈసారి ఫలితాల ప్రకటనలో మరో ప్రత్యేకత ఏమిటంటే… వాట్సాప్ ద్వారా కూడా విద్యార్థులు తక్షణమే తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009కు “హాయ్” అని మెసేజ్ పంపితే, వెంటనే ఫలితాలను చూసే లింక్ వస్తుంది. ఈ సేవను “మన మిత్ర” ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తున్నారు.
నారా లోకేశ్ ఈ సందర్భంగా పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. “మీ కృషికి ప్రతిఫలంగా మంచి ఫలితాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఫలితాలు మీ భవిష్యత్తుకు బలమైన అడుగులు వేయాలి” అని తెలిపారు.
ఇంటర్ ఫలితాలు చెక్ చేయడం ఎలా?
వాట్సాప్ ద్వారా ఫలితాలు చెక్ చేయాలంటే:
9552300009 నంబర్‌కు “హాయ్” అని మెసేజ్ చేయాలి
వచ్చిన మెనూలో విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి
“AP Inter Results 2025” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి
ఫలితాలు మరియు మెమో తక్షణమే డౌన్‌లోడ్ అవుతాయి
అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫలితాలు చెక్ చేయొచ్చు:
🔗 https://resultsbie.ap.gov.in
ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరిగాయి. అన్ని పేపర్ల మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.
ఈసారి ఫలితాల ప్రకటన మరింత డిజిటల్ ఆధారంగా, సులభంగా ఉండేందుకు ప్రభుత్వం స్పెషల్ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ఇంట్లో నుంచే ఫలితాలు తెలుసుకోవచ్చనే విధంగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.