వరలక్ష్మి వ్రతం హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ రోజున లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా పూజలు చేసి, ప్రసాదాలు సమర్పించడం వలన ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసించబడుతుంది. అయితే ఏ ప్రసాదాలు చేయాలో తెలియక కొంతమంది అయోమయంలో పడతారు.
అందుకే ఈ రోజు చేసుకోవచ్చిన ప్రత్యేక ప్రసాదాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
1. పులిహోర
చింతపండు రసం, మసాలాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వేయించిన శెనగపప్పు, పల్లీలు.. అన్నీ కలిపి మసాలా తాళింపు చేసి వండిన అన్నంలో కలిపితే టేస్టీ పులిహోర సిద్ధం అవుతుంది. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది ముందుంటుంది.
2. అల్లం గారెలు
మినపప్పు రుబ్బి, అందులో అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలిపి నూనెలో వేయించుకుంటే స్పైసీగా ఉండే అల్లం గారెలు తయారవుతాయి. ఇవి నైవేద్యానికి ప్రత్యేకమైన తినుబండారంగా ఉపయోగపడతాయి.
3. పూర్ణం బూరెలు
శెనగపప్పు, బెల్లంతో తయారయ్యే పూర్ణం మిశ్రమాన్ని మినపప్పు-బియ్యం పిండి మిశ్రమంతో ముడిపట్టి నూనెలో వేయిస్తే పూర్ణం బూరెలు రెడీ! ఈ స్వీట్ ప్రసాదం లేకుండా వ్రతం పూర్తి కాదు అన్నట్టు!
4. దద్దోజనం
ఒక గిన్నెలో తెల్ల అన్నాన్ని వేయండి. ఆ అన్నంలో పాలు, పెరుగు వేసి బాగా కలుపుకోండి.. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అవసరం అయితే నీళ్లు కూడా వేసి కలపండి. సింపుల్ గానూ, శాంతిని పంచే పవిత్ర నైవేద్యంగా పరిగణించబడుతుంది. పైగా తాళింపు వేస్తే రుచికి రుచే!
5. శెనగల తాళింపు
నానబెట్టిన కొమ్ము శెనగలతో తయారయ్యే తాళింపు భక్తికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీలకర్ర, కరివేపాకులు, ఎండు మిర్చి తాళింపుతో చేసిన ఈ వంటకం సంప్రదాయ నైవేద్యాల్లో ఒకటి.
ఈ వ్రతం రోజు ఈ ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తే.. అదృష్టం, శుభం, సౌభాగ్యం ఇంట్లోకి ప్రవేశిస్తాయని పెద్దల నమ్మకం. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం.