తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి శుభవార్త వచ్చింది. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడేలా, తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ఉచితంగా యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈవో జె. శ్యామలరావు అధికారులను ఈ మేరకు ఆదేశించారు.
ఇప్పటికే ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేయాలని చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి, వారి సూచనలతో వేగంగా కార్యాచరణను అమలు చేయాలని ఈవో సూచించారు.
తిరుపతిలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులపై సమీక్ష సందర్భంగా, అవి సమయానికి పూర్తయ్యేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు.
వేసవి కాలంలో తిరుమలకు భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో, రద్దీ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జేఈవోకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా స్థానిక ఆలయాల్లో నిర్వహణపై దృష్టిసారించాలని అన్నారు.
ఇంతటితో ఆగకుండా, ఆరోగ్య శాఖ, టీటీడీ కొనుగోళ్ల విభాగం, విద్యా, వైద్యం, శ్వేత తదితర విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి, ఎఫ్.ఎ & సిఎవో బాలాజి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.