Tholi Ekadasi 2025: తొలి ఏకాదశి వ్రతం వల్ల కలిగే అద్భుత ఫలితాలు.. తప్పకుండా చదవండి!

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజును “తొలి ఏకాదశి”గా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుని ఉపవాసంతో, భక్తితో పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, మరణానంతరం మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ ఏకాదశిని “దేవశయనీ ఏకాదశి”గా, “పేలాల పండగ”గా కూడా పిలుస్తారు. ఈ ఏకాదశితోనే తెలుగు పండగల పరంపర మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ సంవత్సరం తొలి ఏకాదశి జులై 6న (ఆదివారం) వచ్చింది. ఈ పవిత్ర రోజున విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శుభప్రదమని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఈ రోజు ఉపవాసం ఉండేవారు ఏకాదశి వ్రత కథను పఠించాలి. ఈ వ్రత కథ వినడం వల్ల పాప విమోచనం కలుగుతుందని, జీవితంలో సౌఖ్యం, శాంతి నెలకుంటుందని పురాణ విశ్వాసం.

ఏకాదశి వ్రత కథ ఇలా సాగుతుంది…

పురాతన కాలంలో సూర్య వంశానికి చెందిన మాంధాత అనే మహారాజు ధర్మబద్ధంగా పాలన సాగించేవాడు. అతని పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. కానీ ఒకసారి తీవ్రమైన కరువు రాజ్యాన్ని కమ్మేసింది. వర్షాలు పడక, పంటలు నాశనమై, ప్రజలు ఆకలితో అల్లాడారు. రాజు మాంధాత ఈ పరిస్థితిని చూసి దుఃఖించాడు. పరిష్కారం కోసం అరణ్యాల్లోకి వెళ్లి అంగీరస మహర్షిని కలిశాడు.

మహర్షి అంగీరసుడు రాజుకి ఇలా అన్నారు: “ఇది నీ తప్పు కాదు రాజా. భూమిపై కొన్ని చోట్ల ధర్మాన్ని పాటించకపోవడం వల్ల కరువు ఏర్పడింది. దీన్ని నివారించాలంటే తొలి ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాలి.”

మహర్షి సూచనల ప్రకారం మాంధాత రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి, ప్రజలతో కలిసి శయని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాడు. వారు నిష్ఠతో వ్రతం చేశాక.. అద్భుతంగా వర్షం కురిసి కరువు తొలగిపోయింది. ప్రజలంతా ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఒక పవిత్ర ఆచారంగా మారింది.

తొలి ఏకాదశి వ్రతం వల్ల లాభాలు:

శరీరం మరియు మనస్సు శుభ్రతకు తోడ్పడుతుంది

పాపాలు తొలగుతాయని నమ్మకం

విష్ణువు అనుగ్రహంతో కోరికలు నెరవేరతాయని విశ్వాసం

కరువు, బాధలు తొలగుతాయని పురాణ గాథలు చెబుతున్నాయి

ఈ ఒక్క కథ వినడం, చదవడం ద్వారా మనం ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. ఈ వ్రతాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే, జీవితంలో శుభాలు తప్ప మరేం ఉండవని భక్తుల నమ్మకం.

Leave a Reply