హిందూ ధార్మిక సంప్రదాయంలో శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో ప్రత్యేకంగా శుక్రవారం రోజులు లక్ష్మీదేవిని పూజించే అనుకూలమైన సమయంగా భావిస్తారు. మహిళలు శ్రద్ధగా పూజలు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ భక్తిని చాటుతారు. ఈ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం కావడంతో, ఇంట్లో శుభఫలితాల కోసం ప్రత్యేక దీపాలను వెలిగించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడం తో పాటు శుభ శక్తులు ఆవిర్భవిస్తాయని అంటున్నారు.
శ్రావణ శుక్రవారానికి ప్రత్యేక దీపాలు ఇవే:
ఉప్పు దీపం:
ఉప్పును లక్ష్మీదేవిగా పూజిస్తారు. శ్రావణ శుక్రవారం లేదా ఎప్పుడైనా ఉప్పుతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుందని చెబుతారు. ఈ దీపం సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత వెలిగించాలి.
ఐదు దీపాలు:
పూజ గదిలో ఒక్కటి కాకుండా ఐదు నెయ్యి దీపాలు వెలిగించాలి. ఇవి పంచభూతాలకు ప్రతీకలు. ఇంట్లో శాంతి, ఆనందం, ఆరోగ్యం, సంపద లభించేందుకు ఇవి దోహదం చేస్తాయని పండితుల అభిప్రాయం.
గోధుమ పిండి దీపం:
గోధుమ పిండిలో నెయ్యి కలిపి దీపం ఆకారంలో తయారు చేసి వెలిగించాలి. శుక్రవారం నాడు దీనిని వెలిగిస్తే ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతాయని నమ్మకం.
పసుపు దీపం:
పసుపును శుభానికి సంకేతంగా పరిగణిస్తారు. శ్రావణ శుక్రవారం నాడు పసుపుతో దీపం వేసి వెలిగిస్తే చెడు దృష్టి తొలగిపోతుంది, సానుకూల శక్తులు వస్తాయని పండితులు అంటున్నారు.
దీపాలతో పాటుగా పాటించవలసిన నియమాలు:
పూజ గదిని శుభ్రంగా ఉంచాలి
శుభ్రమైన వస్త్రాలు ధరించాలి
ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు
పేదలకు దానం చేయాలి
లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం, తోటకూర వంటివి నైవేద్యంగా సమర్పించాలి
ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో నిత్యం ఉండే అవకాశం ఉంది.