Mahalaya Amavasya: రేపే మహాలయ అమావాస్య.. ఈ నియమాలు తప్పక పాటించాలి

హిందూ సంప్రదాయంలో మహాలయ అమావాస్య అనేది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున పూర్వీకులను స్మరించుకోవడం, తర్పణాలు, పిండ ప్రధానాలు వంటి కర్మకాండాలు నిర్వహించడం ఒక ముఖ్య విధానం. పండితుల ప్రకారం, ఈ పనులు చేయడం వల్ల పూర్వీకులు శాంతి పొందుతారని, వారి ఆశీస్సులు కుటుంబానికి లభిస్తాయని నమ్మకం ఉంది.

పితృ తర్పణాలు, పిండ ప్రధానాలు

మహాలయ అమావాస్య ముఖ్య కర్మ పితృ తర్పణాలు, పిండ ప్రధానాలు. ఉదయం నదిలో లేదా చెరువులో స్నానం చేసి, నల్ల నువ్వులు, బియ్యం, నీరు కలిపి తర్పణం ఇవ్వడం ద్వారా పూర్వీకులను స్మరించుకుంటారు.

నదులకు వెళ్లలేని వారు ఇంటిలో పండితుల సమక్షంలో తర్పణాలు చెయ్యవచ్చు. తర్పణం తర్వాత బియ్యం పిండితో చేసిన ముద్దలను పూర్వీకులకు నైవేద్యంగా ఉంచుతారు. ఆ ముద్దలను తరువాత కాకులకు లేదా గోవులకు ఇవ్వడం సంప్రదాయం. కాకులను పితృ దేవతల ప్రతిరూపంగా భావిస్తారు.

ఉపవాసం, దానధర్మాలు

ఈ రోజున చాలామంది ఉపవాసం పాటిస్తారు. పితృ కర్మలు పూర్తి అయ్యేవరకు ఉపవాసం కొనసాగుతుంది. ఉదయం పూజలు, ప్రార్థనలు మాత్రమే చేస్తారు, సాయంత్రం కర్మలు పూర్తయిన తరువాత మాత్రమే భోజనం.

దానధర్మాలు చేయడం ముఖ్యమైనది. పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం పొందుతారు. ధనం ఎంత చిన్నదైనా దానాన్ని చేయడం ద్వారా పితృ దోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్మకం ఉంది.

పరిశుభ్రత, ఆచరణలు

మహాలయ అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచాలి, ముఖ్యంగా పూజా స్థలాన్ని, వంటగదిని పరిశుభ్రంగా ఉంచడం అవసరం. వంటకాలు పూర్వీకులకు ఇష్టమైనవి వండాలి. సాధారణంగా ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం వండుతారు, ఆహారంలో తీపి, పులుపు, కారం సమతుల్యం ఉండేలా చూసుకోవాలి.

ఈ రోజున ఎవరినీ నిందించరాదు, చెడు మాటలు మాట్లాడకూడదు. ప్రశాంతంగా, మంచి ఆలోచనలతో ఉండటం అవసరం. పూర్వీకులను స్మరించడం ద్వారా వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని, కుటుంబంలో సుఖసంతోషాలు కొనసాగుతాయని పండితులు చెప్పుకుంటున్నారు.

Leave a Reply