దసరా, దీపావళి వంటి పండుగలు రాబోతున్న వేళ బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75 వేలుండగా, ఇప్పుడు అది రూ.1,10,000కు చేరింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో అయితే ధరలు మరింత పెరిగిపోతాయి.
అయితే గత రెండు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం సుమారు రూ.500 తగ్గి, ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,09,264గా ఉంది. అలాగే వెండి ధర కూడా కాస్త తగ్గి, కిలో రూ.1,25,563కు చేరింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
10 శాతం వరకు తగ్గవచ్చని అంచనా
డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, సుంకాల ఉపశమనం వంటి కారణాల వల్ల బంగారం ధరలు 5-10 శాతం వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలంలో 5-6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. అయితే వెండి ధరలు పెద్దగా తగ్గే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పండుగ సీజన్‌లో బంగారం ఔన్సుకు 3700 డాలర్ల వద్ద ఉండవచ్చని అంచనా.
భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష కంటే తక్కువకు పడిపోవచ్చని చెబుతున్నారు. అయితే ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే ధరలు మళ్లీ పెరగవచ్చు. మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలుకు త్వరపడకూడదని, కొంతకాలం వేచి చూసి కొనమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు 22K, 24K బంగారంతో పాటు 18K, 14K ఆభరణాలవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో ఆభరణాలు అందుబాటులో ఉండటం దీనికి కారణంగా చెప్పబడుతోంది.

 
			 
			 
			