Rahul Sipligunj: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్..!

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా హరిణి రెడ్డి అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు సమాచారం. ఈ వేడుక చాలా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది. రాహుల్ అధికారికంగా ప్రకటించకపోయినా, వేడుకకు హాజరైన అతిథులు షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో విషయం బయటపడింది. ఈ పిక్స్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అనూహ్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అందరికీ షాక్ ఇచ్చాడు రాహుల్. ముఖ్యంగా తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలినే పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం అభిమానుల్లో హైలైట్‌గా మారింది. ఎంగేజ్‌మెంట్‌లో రాహుల్ పాస్టెల్ ల్యావెండర్ షేర్వాణీ ధరించగా, హరిణి ఎరుపు రంగు లెహంగా లో మెరిసిపోయింది.

హైదరాబాద్‌లో జన్మించి, గల్లీ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన రాహుల్, ఈరోజు ఆస్కార్ స్థాయికి ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. కీరవాణి సంగీతంలో రాహుల్, కాలభైరవ పాడిన పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో తెలంగాణ నుంచి మొదటిసారిగా ఆస్కార్ వేదికపై నిలిచిన సింగర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయల చెక్కును బహుమతిగా అందించింది.

రాహుల్‌ 2009లో నాగ చైతన్య నటించిన జోష్ సినిమా “కాలేజ్ బుల్లోడా” పాటతో సినీ ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ తర్వాత దమ్ములో “వాస్తు బాగుందే”, రచ్చలో “సింగరేణి ఉంది” పాటలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలంలో “రంగ రంగ రంగస్థలాన”, మహర్షిలో “పాలపిట్ట” పాటలు రాహుల్‌ని స్టార్ సింగర్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.

కెరీర్ మొదట్లో గల్లీ కా గణేష్, మగజాతి, మాకికిరికిరి, దావత్, పూర్ బాయ్ వంటి సొంత ఆల్బమ్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన రాహుల్, ఆ ఫేమ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

సింగింగ్‌తో పాటు నటనలో కూడా తన ప్రతిభ చూపిన రాహుల్, రంగమార్థండా సినిమాలో శివాని రాజశేఖర్ జోడీగా హీరోగా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా, బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన తర్వాత రాహుల్ ఫేమ్ మరింత పెరిగింది.

Leave a Reply