Richest Ganpati: ఖరీదైన వినాయకుడు.. ముంబయి గణపయ్యకు రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌

ముంబయిలోని మతుంగా ప్రాంతంలో జీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటు చేసే వినాయక మండపం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ గణపతి ఉత్సవానికి ఏకంగా రూ.474.46 కోట్ల ఇన్సూరెన్స్‌ తీసుకోవడం సంచలనంగా నిలిచింది. గత ఏడు దశాబ్దాలుగా ఈ మండలి ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తోంది. ఈసారి 71వ వార్షికోత్సవం జరగనుంది.

దేశవ్యాప్తంగా ఈ నెల 27న వినాయక చవితి జరగనుండగా, ఇప్పటికే మండపాల వద్ద అలంకరణలు, విభిన్న ఆకృతుల విగ్రహాలు, భారీ సెట్టింగులు భక్తులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ముంబయి శివారులోని ఈ మండపం దేశంలోనే సంపన్న గణపతిగా ప్రసిద్ధి చెందింది.

భారీ బీమా వెనుక కారణం ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగడం ఖాయం. గణపతిని బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత. గత ఏడాది కూడా ఈ మండపానికి రూ.400 కోట్ల బీమా చేశారు. ఈసారి పూజారులు, నిర్వాహకులు, భద్రతా సిబ్బంది అందరికీ రూ.375 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ ఉంది. గణపయ్య ఆభరణాలకు మాత్రమే రూ.67 కోట్ల బీమా తీసుకున్నారు. గతంలో 2023లో రూ.38 కోట్లు, 2024లో రూ.43 కోట్లకే పరిమితమైన ఈ బీమా, ఇప్పుడు అతి పెద్ద మొత్తానికి చేరుకుంది.

మరియు మంటపంలో అగ్నిప్రమాదం, భూకంపం వంటి విపత్తుల కోసం మరో రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌ వేశారు. ఫర్నీచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు కూడా బీమా పరిధిలోకి వస్తాయి. పబ్లిక్ లయబిలిటీ కింద రూ.30 కోట్ల కవరేజ్ ఉంది.

భక్తుల సౌకర్యార్థం ఈసారి QR కోడ్ సర్వీసులు, డిజిటల్ లైవ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. భద్రత కోసం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఐదు రోజులపాటు జరిగే ఈ గణేశ్ ఉత్సవాల్లో ప్రతిరోజూ సుమారు 20 వేల మంది భక్తులు, మొత్తం మీద లక్ష మందికి పైగా ప్రజలు దర్శనం చేసుకుంటారని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply