వినాయక చవితి రోజున గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. అయితే ఈ సందర్భంలో వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కానీ చాలామంది తెలిసి తెలియక కొన్ని వాస్తు పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం.
భారతదేశంలో జరుపుకునే పండగల్లో గణేష్ చతుర్థి అత్యంత ప్రీతికరమైన పండగ. ఈ పండగ వస్తుందంటే పదిరోజుల ముందే పట్టణాలు, గ్రామాలు ఉత్సవ వాతావరణంలో మునిగిపోతాయి. ప్రతి ఊరులోనూ వినాయక మండపాలు నిర్మించి సామూహికంగా జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27న జరగనుంది.
వినాయకుడిని ప్రతిష్టించే సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు:
తప్పు దిశలో ప్రతిష్టించకండి
వినాయక విగ్రహాన్ని దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచరాదు. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచరాదు
బెడ్‌రూమ్, బాత్రూమ్, కిచెన్ లేదా మెట్ల కింద విగ్రహాన్ని ఉంచడం వాస్తు ప్రకారం తప్పు. ఈ ప్రదేశాలు అపవిత్రంగా భావించబడతాయి.
నేరుగా నేలపై కాకుండా పీటపై ఉంచాలి
గణపయ్య విగ్రహాన్ని నేలపై నేరుగా ఉంచరాదు. ఒక పీట లేదా ఎత్తైన వేదికపై ఉంచితే అది గౌరవ సూచకం అవుతుంది.
ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు వద్దు
ఇంట్లో ఎక్కువ విగ్రహాలు ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఇది శక్తి ప్రవాహాన్ని దెబ్బతీస్తుంది.
అధిక అలంకరణకు దూరంగా ఉండాలి
గణపయ్య చుట్టూ ఎక్కువ వస్తువులు, అలంకరణ వస్తువులు ఉంచరాదు. విరిగిన లేదా పగిలిన విగ్రహాలను కూడా ఇంట్లో పెట్టడం అశుభం.
పూజలో నిర్లక్ష్యం చేయరాదు
ప్రతిష్టించిన తర్వాత నిమజ్జనం చేసే వరకు నిత్య పూజలు జరపాలి. వాడిపోయిన పూలు, పాత ప్రసాదం, దుమ్ము పట్టిన వస్తువులు గణపయ్య ముందు ఉంచడం వాస్తు దోషం అవుతుంది. మొదటి రోజు పూజ తర్వాత వినాయకుడిని ఒంటరిగా వదిలేయకూడదు.