CM KCR Tour: పంట నష్టంపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
గురువారం ఉదయం ఖమ్మం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంట నష్టాన్ని ఏరియల్‌గా సర్వే నిర్వహించారు . ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు, వడగళ్ల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులు అధైర్య పడొద్దని వారిని కూడా తమ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు. అయితే జరిగిన పంట నష్టాన్ని వైమానిక పరిశీలన చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు.
ఈ సందర్బంగా రామాపురం, గార్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో పొలాలను పరిశీలించారు సీఎం కేసీఆర్.
ముఖ్యమంత్రి వెంట వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రైతుబంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.
ఈ సర్వే లో భాగంగా తొలుత బోనకల్ మండలం రావినూతల గ్రామాన్ని సందర్శించి కౌలు రైతు వి రామకృష్ణ తదితరులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రామాపురం, గార్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో పొలాలను పరిశీలించారు.
ఒక్క బోనకల్ మండలంలోనే 7092 మంది రైతులు 10,324 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 31,027 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో 22,000 మంది రైతులు నష్టపోయారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి సీఎం కు వివరించారు.
మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ గ్రామాలలో పంట నష్టం అంచనాకు చంద్రశేఖర్ రావు కూడా వెళ్లనున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు ఎస్.వెంకట వీరయ్య, ఎల్.రాములునాయక్, కె.ఉపేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎల్.కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకొని పరిసర గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్నారు. వరంగల్ పర్యటన తర్వాత కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.