MLC Elections: ఏపీ నేడు ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడి లోని ఏపీ అసెంబ్లీ లో మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం ఏడు స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. బరిలో నిలిచిన ఏడు స్థానాలను కైవసం చేసుకోవాలని ఒక ప్రక్క వైసీపీ పట్టుదలగా ఉంది. మరో ప్రక్క ఏదైనా అద్భుతాలు జరిగితే తాము బరిలో నిలిపిన అభ్యర్ధి విజయం సాధించే అవకాశం ఉందని టీడీపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. తమ అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.
అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే దీంతో అధికార వైకాపా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తమ ఎమ్మెల్యేలకు అవగాహన కలిగించేలా ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. సంఖ్యా బలం అనుకూలంగా లేనప్పటికీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. టీడీపీ అభ్యర్థిగా మహిళా నేత పంచుమర్తి అనురాధ పోటీలో ఉన్నారు.ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతును ప్రకటించారు.వల్లభనేని వంశీ, కరణం బలరాం,వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో టీడీపీ బలం 19కి తగ్గిపోయింది. అసెంబ్లీలో వైసీపీకి 151 మంది సభ్యులున్నారు. టీడీపీలో విజయం సాధించి వైసీపీ మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ బలం 155కి చేరింది. మరోవైపు జనసేన నుండి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో ఈ బలం 156కి చేరింది.
ఈ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ ను జారీ చేసింది. విప్ ను ధిక్కరించి ఓటు చేస్తే చర్యలు తీసుకోవచ్చు. వైసీపీకి మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా విప్ పంపినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తమకు మద్దతిస్తారని టీడీపీ ఆశతో ఉంది. దీంతో తమకు 21 ఎమ్మెల్యేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశతో ఉన్నారు. మరో ఒక్క ఓటు లభిస్తే పంచుమర్తి అనురాధ విజయం సాధించే అవకాశం ఉంటుంది.