Heavy rain: హైదరాబాద్లో భారీ వడగండ్ల వాన
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ రోజు (శనివారం) సాయంత్రం పెద్ద ఎత్తున వడగండ్ల వాన పడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్పేట్, టోలిచౌకి, మోహిదీపట్నం, మణికొండ, నార్సింగి, పటాన్చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈ భారీ వర్షం ధాటికి జనజీవనం నిలిచిపోయింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు బారులుతీరారు.
అయితే ఇలాగే మరో నాలుగు గంటల పాటు వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరింకాలు జారీచేశారు. ఇక తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల తాకిడికి పలు రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో రవాణా స్తంభించి అస్తవ్యస్తంగా మారింది. అలాగే బాన్సువాడ డివిజన్ కేంద్రంలోనూ వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అకాల వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
అలాగే సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన భీకరంగా కురిసింది. జిల్లాలోని మర్పల్లిలో అరగంట పాటు ఈ వడగండ్ల వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. రహదారులన్నీ వడగండ్లతో నిండిపోయాయి. పెద్ద మొత్తంలో పడిన వడగండ్లతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వడగండ్ల వర్షాన్ని తిలకించారు. జిల్లాలో అకాల వర్షాల ప్రభావం మరో నాలుగైదు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు పగలు, రాత్రి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేటలో కూడా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.