New Zealand vs Sri Lanka Test Series 2023:
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా తొలి విజయం నేపథ్యంలో శ్రీలంక జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ చేరే మార్గం సుగమం చేసుకునేందుకు గొప్ప అవకాశం లభించిందంటూ లంక క్రికెటర్లు తెగ సంబరపడిపోతున్నారు. అయితే అదే సమయంలోడబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే అదృష్టం కలిసిరావడంతో పాటు కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందంటున్నారు.
స్వదేశంలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన మూడో మ్యాచ్‌లో మాత్రం ఆసీస్ చేతిలో పరాభవం మూటగట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించిన భారత జట్టు ఇండోర్‌లో అదే రీతిలో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీమిండియా మరికొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి. అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
అయినప్పటికీ న్యూజిలాండ్- శ్రీలంక టెస్టు ఫలితం తేలిన తర్వాతే ఇంగ్లండ్‌లో ఆసీస్‌ను ఫైనల్లో ఢీకొట్టే జట్టు గురించి అధికారిక ప్రకటన వస్తుంది. అలాగే డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో పదింట 5 టెస్టులు గెలిచిన శ్రీలంక 53.33 విజయశాతంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ లంక ఫైనల్ చేరాలంటే ఆసీస్ చేతిలో టీమిండియా ఓడటం సహా న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్య జట్టును లంక 2-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది. అయితే అదేమీ అంత తేలికైన విషయం కాదు. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా ఇదే మాట అంటున్నాడు.
”న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం అంటే అత్యంత కష్టంతో కూడుకున్న పని. అయితే, గత పర్యటనలో మేము మెరుగైన ప్రదర్శన కనబరచడం సానుకూలాంశం. ఏదేమైనా ఇక్కడ గెలవాలంటే వాళ్లెలాంటి వ్యూహాలు అమలు చేస్తారో మేము కూడా అలాంటి ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. వాళ్లు మాకు కఠిన సవాలు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంగ్లండ్ దూకుడైన ఆటతో టెస్టులకు సరికొత్త నిర్వచనం చెబుతోంది. వాళ్ల శైలి వాళ్లది మా ఆట తీరు మాది. అయితే మేమేమీ ఒత్తిడికి లోనుకావడం లేదు. మరి ఫైనల్ చేరాలంటే మా ముందున్న ఏకైక మార్గం రెండు మ్యాచ్‌లు గెలవడమే. అందుకోసం మేము అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది” అని మాథ్యూస్ పేర్కొన్నాడు. కాగా మార్చి 9 నుంచి కివీస్- లంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
అంతకంటే ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిన సౌథీ బృందం రెండో టెస్టులో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సిరీస్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పటిష్ట జట్టు, డబ్ల్యూటీసీ టైటిల్ తొలి విజేత న్యూజిలాండ్‌ను ఓడించాలంటే లంక అద్భుతం చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి :