తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భారీ చోరీ కలకలం రేపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట 30 నిమిషాల సమయంలో ముగ్గురు దుండగులు ఆలయం లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. విగ్రహాలతో పాటు సుమారు 15 కిలోల వెండి, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ప్రసిద్ధి పొందిన దేవాలయంలో చోరీకి దేవాలయ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అంజన్న భక్తులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి ప్రధాన ఆలయం వెనుక వైపు ఉన్న బేతాళ గుడి ప్రాంతం నుంచి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం లోపలకు చొరబడ్డారు. చేతుల్లో కటింగ్ ప్లేయర్తో పాటు ఇతరత్రా సామాగ్రి ఉన్నాయి. ఆలయం లోపలికి వచ్చి వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను దొచుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకొచ్చింది. సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ రంగంలోకి దింపి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వేలు ముద్రల సేకరణ తీసుకోగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. మల్యాల సీఐ కొండగట్టుకు చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు.
కొండగట్టు ఆలయ చరిత్రలోఇదే మొట్టమొదటిసారి దొంగతనం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నిందితులు ముసుగు వేసుకుని వచ్చి చోరీకి పాల్పడ్డారని అంటున్నారు. ఆలయం మూసివేసిన తర్వాత రాత్రిపూట నలుగురు హోంగార్డులు మాత్రమే ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారు. అయినా ఈ చోరీ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది చోరీ ఘటన నేపథ్యంలో ఆలయాన్ని అధికారులు మూసివేశారు.
ఇది కూడా చదవండి :