BCCI బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. సెలెక్షన్ కమిటీ ఉద్యోగాలు ఊస్ట్!
Bcci ఇటీవలి కాలంలో భారత జట్టు బడా వేదికలపై చేతులెత్తేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ ఫైనల్ కూడా చేరలేకపోయిన టీమిండియా.. ప్రపంచకప్‌లో కూడా సెమీస్‌లో ఇంగ్లండ్ వంటి బలమైన ప్రత్యర్థి ఎదురవగానే తడబడింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ రెండు సిరీసులకు జట్టును ప్రకటించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. సెలెక్టర్లు ఏ ఆలోచనతో టీంను ఎంపిక చేస్తున్నారంటూ అభిమానులు, మాజీలు ప్రశ్నించారు.
కొన్నిరోజుల క్రితం సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ.. సెలెక్షన్ కమిటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. చెప్పినట్లే సెలెక్షన్ కమిటీపై కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుపై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సహా అందర్నీ తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది బీసీసీఐ.ఆసియా కప్ వైఫల్యం తర్వాత సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని మాజీలు, అభిమానులు విమర్శించారు. ఇక టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత ఇది ఆగ్రహంగా మారింది.
ఆ తర్వాత న్యూజిల్యాండ్ సిరీస్‌కు కూడా సరైన జట్టును ఎంపిక చేయకపోవడంతో అభిమానులు తిట్టిపోస్తున్నారు. చేతన్ శర్మ అండ్ కో బృందం పనితీరు కూడా ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి మాటలూ లేకుండా సడెన్‌గా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించేసిన వివాదాస్పద నిర్ణయం కూడా ఈ బృందమే తీసుకున్న సంగతి తెలిసిందే.చేతన్ శర్మ సహా మొత్తం సెలెక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది.
వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఏడు అంతర్జాతీయ టెస్టు మ్యాచులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేదా పది వన్డే, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన వారు ఈ పదవులకు అర్హులని ప్రకటించింది. అలాగే క్రికెట్ నుంచి కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యి ఉండాలని తెలిపింది. ఈ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటలు అని వెల్లడించింది. మరి ఈ పదవుల కోసం ఎవరు దరఖాస్తులు చేస్తానో చూడాలి.
ధోనీని టీమిండియా కోచ్‌గా నియమించండి! దాంట్లో అతను మాస్టర్ మైండ్… పాక్ మాజీ సల్మాన్ భట్ కామెంట్..
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచి ఇంటిదారి పట్టిన భారత జట్టు, 2022 టోర్నీలో సెమీస్ నుంచి నిష్కమించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో అప్పుడెప్పుడో 2013లో చివరిగా ఐసీసీ (ఛాంపియన్స్ ట్రోఫీ) టైటిల్ గెలిచిన భారత జట్టు, 9 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది… ఆగస్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్… ఆఖరి మ్యాచ్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ ఆడాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో రనౌట్ అయిన ధోనీ, ఆఖరి మ్యాచ్‌లోనూ రనౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు…
రెండు రనౌట్ల మధ్య సాగిన క్రికెట్ కెరీర్లో టీమిండియా కెప్టెన్‌గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మహేంద్ర సింగ్… టెస్టుల్లో టీమ్‌ని నెం.1గా నిలిపాడు. వన్డే, టీ20 సిరీసుల్లో ఫినిషర్‌గానూ అద్భుత విజయాలు అందించాడు..2021 టీ20 వరల్డ్ కప్‌కి మెంటర్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2023 ఐపీఎల్ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత ధోనీని టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించాలని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్…మహేంద్ర సింగ్ ధోనీలాంటి ప్లేయర్ దొరకడం టీమిండియా అదృష్టం.
ప్రెషర్ని ఎలా తట్టుకుని నిలబడాలో మాహీకి బాగా తెలుసు. ధోనీ ప్లేయర్లను చక్కగా అర్థం చేసుకుంటాడు, అంతే త్వరగా గేమ్‌ని రీడ్ చేస్తాడు. అందుకే అంత సక్సెస్ఫుల్ కెప్టెన్ కాగలిగాడు…మాహీ గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా. ప్రతీ చిన్న విషయంలో ధోనీ తీసుకునే నిర్ణయాలు చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేవి. ఏ టీమ్‌కి అయినా ధోనీ లాంటి మాస్టర్ మైండ్ దొరకడం గొప్ప ఆస్తి కిందే లెక్క. మాహీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే టీమిండియాకి మరిన్ని విజయాలను అందించేవాడు…ఇప్పటికైనా మాహీని టీమిండియాకి కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది.
ఆటగాళ్ల నుంచి నూటికి 200 పర్సెంట్ పర్ఫామెన్స్ ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ప్లేయర్లలోని ఒత్తిడిని తగ్గించి, వారి నుంచి రావాల్సిన రిజల్ట్ రాబట్టగలడు…’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..
ప్రపంచకప్ ఎఫెక్ట్.. టీ20లకు నయా కెప్టెన్ హార్దిక్, రోహిత్‌కు చెక్.. అఫీషియల్ ప్రకటన అప్పుడే?
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం బీసీసీఐకి కనువిప్పు కలిగింది. ఒక్కొక్కటిగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ.. జట్టును ప్రక్షాళన చేస్తోంది. ఇప్పటికే జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బోర్డు.. త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పలు విదేశీ జట్లు పాటిస్తున్న Split కెప్టెన్సీ(వేర్వేరు కెప్టెన్ల)ని టీమిండియాలోకి ఆచరణకు తీసుకురావాలని చూస్తున్నట్లు బీసీసీఐ కీలక అధికారి స్పోర్ట్స్ వెబ్సైట్ ఇన్సైడ్ స్పోర్ట్(Inside Sport)కు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపడుతోన్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడి సారధ్యంలోనే భారత్ జట్టు ఘోర ఓటమిపాలైంది. టీ20 ఫార్మాట్లో ఆశించినస్థాయిలో ఫలితాలు రాకపోవడం, అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలం కావడంతో.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంచుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇకపై టీ20లకు హార్దిక్ పాండ్యా సారధ్యం వహించనుండగా.. టెస్టులు, వన్డేలకు మాత్రం రోహిత్ శర్మను కెప్టెన్‌గా పరిమితం చేయాలని యోచిస్తోందట. కొత్త సెలెక్షన్ ప్యానెల్ వచ్చిన తర్వాత ఓసారి చర్చించి.. దీనిపై అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా హార్దిక్ సారధ్యంలోనే టీమిండియా.. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడిన అనంతరం.. కెప్టెన్సీ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదిలా ఉంటే..
అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఈ మార్పులు ఏంటని కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ మినహాయిస్తే.. రోహిత్ శర్మ ఆటతీరులో ఎలాంటి మార్పు లేదని.. కెప్టెన్‌గా రోహిత్‌కు మరికొంత కాలం ఛాన్స్ ఇవ్వొచ్చునని బీసీసీఐని కోరుతున్నారు. ఇంకొందరైతే.. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో మార్పులు, కెప్టెన్‌ను మార్చాలని అంటున్నారు. హార్దిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు ఇవ్వడం కరెక్టేనని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు బీసీసీఐ తీసుకోబోతోందో మరి చూడాలి.