కవిత VS అరవింద్ దాడి కేసు మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు దాడి చేయగా.. వీరిపై కేసులు నమోదయ్యాయి. అంతే కాదు దాడి చేసిన వారిలో ఎనిమిది మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎంపీ అరవింద్ చేసిన ఫోన్ కాల్ కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి. కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపన సమయంలో ఎమ్మెల్సీ కవితకు ప్రాధాన్యతనివ్వలేదనీ. దీంతో కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారనీ. ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని అర్వింద్ అన్నారు. ఈ మాటలకు ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదనీ.. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటబడి ఓడిస్తానని సవాల్ విసిరారు. మళ్లీ మాట్లాడితే.. కొట్టి సంపుతం అంటూ కవిత కామెంట్ చేశారు.
సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ జాగృతి శ్రేణులు హైదరాబాద్ లోని అరవింద్ ఇంటిపై దాడికి దిగారు. ఇంటి ఆవరణలోని పూల మొక్కలు, కారు, ఇంట్లోని ఫర్నీచర్, దేవుడి పటాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఇంట్లో అరవింద్ తల్లి ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్ లో దిశ సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడి విషయం తెలుసుకున్న అరవింద్, కవితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది కుల అహంకారంతో జరిగిన దాడిగా వర్ణించారు.
అయితే, ఈ దాడిలో పాల్గొన్న వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు బంజారాహిల్స్ పోలీసులు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదయిన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజారామ్ యాదవ్, మన్నెగోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నేత స్వామి ఉన్నారు. అరవింద్ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన కంప్లయింట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేశారు ఎంపీ అరవింద్. కవితను సైతం అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.