కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు హరీష్ రాయ్ (Harish Rai) ఇక లేరు. గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ బంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 55 సంవత్సరాలు.
హరీష్ రాయ్ పేరు తెలుగువారికి కూడా పరిచితమే. సూపర్‌హిట్ సినిమా ‘కేజీఎఫ్’ (KGF)లో యశ్ మామ పాత్రలో కనిపించి అందరి మనసులు గెలుచుకున్నారు. అలాగే ‘ఓం’, ‘దండ నాయక’, ‘అజాగజంతర’ వంటి అనేక సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు.
ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు క్యాన్సర్ నాలుగో దశకు చేరిందని వెల్లడించగా, ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు చివరి క్షణం వరకు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ చివరికి మరణం ఆయనను విడిచిపెట్టలేదు.
హరీష్ రాయ్ చికిత్స కోసం భారీ ఖర్చు అయినట్టు సమాచారం. ఒక్క ఇంజెక్షన్‌కి రూ.3.5 లక్షలు ఖర్చవుతుందని ఆయన స్నేహితులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడినట్టు చెబుతున్నారు.
కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “సినిమా రంగం ఒక మంచి నటుడిని కోల్పోయింది” అంటూ కేజీఎఫ్ టీమ్, దర్శకులు, సహనటులు బాధ వ్యక్తం చేశారు.
