భారతదేశంలో రైడ్-హైలింగ్ రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రైవేట్ కంపెనీలు ఓలా, ఉబర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టేలా “భారత్ ట్యాక్సీ” అనే సహకార (Co-operative) క్యాబ్ సేవ త్వరలో దేశవ్యాప్తంగా రోల్ అవుతుంది.
నవంబర్‌లో పైలట్ ప్రారంభం
భారత్ ట్యాక్సీ సేవను ఈ నవంబర్‌లో ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. తొలి దశలో 650 వాహనాలు రోడ్డెక్కనున్నాయి. డ్రైవర్లే వాహన యజమానులు అవుతారు. సర్వీస్ విజయవంతమైతే, డిసెంబర్ నాటికి దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించనుంది. ముంబై, పుణే, భోపాల్, లక్నో, జైపూర్ వంటి నగరాలు మొదటి జాబితాలో ఉన్నాయి.
8 సహకార సంస్థల సంయుక్త ప్రణాళిక
ఈ ప్రాజెక్టును ఎన్సీడీసీ (NCDC), ఐఎఫ్ఎఫ్సీవో (IFFCO), అమూల్ (GCMMF) వంటి ఎనిమిది ప్రముఖ సహకార సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి.
ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం — ఈ ట్యాక్సీ సేవలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండదు. మొత్తం నిధులు సహకార సంస్థల నుంచే వస్తాయి. ₹300 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
డ్రైవర్లకే లాభదాయకం
భారత్ ట్యాక్సీ “డ్రైవర్-ఫస్ట్” మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే, డ్రైవర్లకు పూర్తి వేతనం, లాభాల్లో వాటా లభిస్తుంది. ఏజెన్సీ కమిషన్ లేదా సర్జ్ ఛార్జ్‌లు ఉండవు. ఈ విధానం డ్రైవర్లకు ఆర్థిక భద్రతను కలిగిస్తే, ప్రయాణికులకు తక్కువ ధరలో, స్థిరమైన చార్జీలతో సేవలు అందుతాయి.
ప్రయాణికులకు న్యాయమైన ధరలు
భారత్ ట్యాక్సీ సేవలో సర్జ్ ప్రైసింగ్ లేకుండా పారదర్శక ధర విధానం ఉంటుంది. పీక్ అవర్స్ లేదా వర్షపు రోజుల్లో కూడా ధరలు పెరగవు. వినియోగదారులు నమ్మకంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయగలుగుతారు.
రాబోయే ప్రణాళిక
2025 చివరి నాటికి భారత్ ట్యాక్సీ సేవలు 20 నగరాలకు విస్తరించే లక్ష్యంతో ఉంది. 2030 నాటికి 1 లక్ష డ్రైవర్లను ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావడమే తుదిలక్ష్యం.
పుణే, ముంబై, నాగ్‌పూర్ వంటి మహారాష్ట్ర నగరాల్లో రెండవ దశలో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కొత్త దిశలో డ్రైవర్ల ఆధిపత్యం
ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రైవర్లు కేవలం ఉద్యోగులు కాకుండా, భాగస్వాములు అవుతారు. వారికీ ఆరోగ్య బీమా, లాభాల్లో వాటా, మెరుగైన వృత్తి గౌరవం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

 
			 
			 
			