హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్లుగా పోరాడిన పోరాటం ఫలించింది. మార్కెట్లో అమ్ముడవుతున్న పానీయాలు “ORS” అని తప్పుగా లేబుల్ వేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆమె ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI)కు ఫిర్యాదులు పంపారు.
ఇక తాజాగా ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న FSSAI, అసలు ఓఆర్‌ఎస్ (Oral Rehydration Salts) ప్రమాణాలను పాటించని పానీయాలకు “ORS” లేదా “ORSL” అనే పేరు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా నిజమైన ORS లో ప్రతి 100 మిల్లీలీటర్లలో సుమారు 1.35 గ్రాముల గ్లూకోజ్, సరైన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అయితే మార్కెట్లో ఉన్న కొన్ని బ్రాండ్లు 8–12 గ్రాముల వరకు చక్కెర కలిపి “ORS” పేరుతో విక్రయించేవి. ఇది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరించారు.
ఈ నిర్ణయంతో ఇకపై తప్పుడు లేబుల్స్ వేసిన పానీయాలు మార్కెట్లో నిలవవు. వినియోగదారుల ఆరోగ్య రక్షణలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు.

 
			 
			 
			