సీతాపూర్‌లో వింత ఫిర్యాదు: “నా భార్య నాగినిలా మారుతోంది, నన్ను కాటేస్తోంది సార్!”

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన అధికారులను ఆశ్చర్యపరిచింది. మెరాజ్ అనే వ్యక్తి తన భార్య రాత్రిపూట నాగినిలా మారి తన్ను కాటేయడానికి ప్రయత్నిస్తోందని జిల్లా కలెక్టర్‌ వద్ద ఫిర్యాదు చేశాడు.

ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా ఆయన కలెక్టర్‌ను కలిసి, “అర్థరాత్రి కాగానే నా భార్య పాములా బుసలు కొడుతోంది… భయంతో నిద్ర కూడా పట్టడం లేదు” అని వాపోయాడు. స్థానిక పోలీసులను పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడంతో చివరికి జిల్లా అధికారులను ఆశ్రయించానని తెలిపారు.

కలెక్టర్‌ వెంటనే విచారణ ఆదేశాలు జారీ చేసి, సబ్‌ డివిజనల్ మేజిస్ట్రేట్‌ (SDM) మరియు పోలీసులను దర్యాప్తుకు నియమించారు. ఈ ఘటనను మానసిక కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో ఈ వార్త క్షణాల్లో వైరల్‌ అయింది. కొందరు నెటిజన్లు సరదాగా “బ్రో, నువ్వూ కోబ్రాలా మారిపో” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు శ్రీదేవి నటించిన ‘నాగినీ’ సినిమాను ప్రస్తావిస్తూ మీమ్స్‌ షేర్ చేస్తున్నారు.

మెరాజ్ లిఖిత ఫిర్యాదులో “నా భార్య ఒకసారి నిజంగానే కరిచింది” అని పేర్కొన్నాడు. ఈ ఆరోపణల వెనుక నిజమెంత అనేది అధికారులు దర్యాప్తు తర్వాత వెల్లడించనున్నారు.

Leave a Reply