పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమైన భాగం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పండ్లు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అయితే పండ్లను సరైన సమయంలో తినడం ఎంత అవసరమో, తప్పు సమయంలో తినకూడదనేది కూడా అంతే ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పండ్లను తప్పుడు సమయంలో తింటే ప్రయోజనాలకన్నా హానులు ఎక్కువగా కలగొచ్చు. ఇకపోతే.. పండ్లను ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు తినడానికి ఉత్తమ సమయాలు
భోజనాల మధ్య విరామంలో: రెండు భోజనాల మధ్య పండ్లు తినడం ఉత్తమం. ఈ సమయంలో కడుపు తేలికగా ఉండటంతో జీర్ణవ్యవస్థ పండ్లలోని పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.
వ్యాయామానికి ముందు: వ్యాయామం చేయడానికి 30–40 నిమిషాల ముందు అరటి లేదా యాపిల్ వంటి పండ్లు తింటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలసట రాకుండా ఉంటుంది.
డెజర్ట్కు బదులుగా: భోజనం తర్వాత తీపి తినాలనే కోరిక వస్తే డెజర్ట్కి బదులుగా పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పండ్లు తినకూడని సమయాలు
ఖాళీ కడుపుతో: ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. అంతేకాకుండా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
రాత్రి భోజనం తర్వాత: రాత్రి ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
అందువల్ల పండ్లను సరైన సమయంలో తింటేనే వాటి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.