NTR Kantara Event : కాంతార ఈవెంట్‌లో రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ ప్రశంసలు.. అభిమానులు క్షమించాలి

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ అక్టోబర్ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఎన్టీఆర్ ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది.

ఎన్టీఆర్ మాట్లాడుతూ, “నాకు 3 ఏళ్లు ఉండగా నానమ్మ చెప్పిన జానపద కథలు గుర్తొస్తున్నాయి. మా ఊరు కుందాపురకి దగ్గరగా ఉందని చెప్పారు. ఆ కథల్లో పంజుర్లి గురించిన విషయాలు ఉండేవి. ఇప్పుడు ఆ చిన్నప్పటి కథలు స్క్రీన్ మీద చూడటం వింతగా, ఇష్టంగా అనిపించింది. ఈ అనుభూతిని ఇచ్చిన నా స్నేహితుడు, అన్న రిషబ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు,” అన్నారు.

ఎన్టీఆర్ రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ, “రిషబ్ ఒక అసాధారణ నటుడు, గొప్ప దర్శకుడు. ఆయనలోని నటుడు, దర్శకుడుకి సినిమాలోని 24 విభాగాలపైనా పూర్తి పట్టు ఉంది. ఈ కథను ఎవరూ రూపొందించలేరు, కేవలం రిషబ్ మాత్రమే చేయగలడు,” అన్నారు.

ఇంకా మాట్లాడుతూ, “నా అమ్మ కోరికతో ఉడుపి శ్రీకృష్ణ మందిరం దర్శించాను. ఇప్పుడు రిషబ్ వల్లే అది సాధ్యమైంది. ఆయన నన్ను తన కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి,” అన్నారు.

ఎన్టీఆర్ స్పీచ్ ప్రారంభంలో, “ఇటీవల గాయపడిన కారణంగా పూర్తి ఎనర్జీతో మాట్లాడలేకపోతున్నాను. అభిమానులు క్షమించాలి,” అని చెప్పారు.

ఈ సినిమాకు విజయ్ కిరగందూర్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 సినిమా కేవలం వినోదానికి మాత్రమే కాదు, మన సంస్కృతి, మూలాల్ని తెరపై చూపించే ప్రయత్నం. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మాటలతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. రిషబ్ శెట్టి ఈ సినిమాతో ప్రేక్షకులను మళ్లీ మంత్రముగ్ధుల చేస్తారని చెప్పడం ఖాయం.

Leave a Reply