జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఈ ప్రకటనను రిలీజ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ విజయం సాధించారు, అయితే జూన్ 8న అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది.
ఈ ఎన్నికకు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, గోపినాథ్ సోదరుడు వజ్రానాథ్, గోపినాథ్ సతీమణి సునీత తదితరులు టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే సునీతకే టికెట్ ఇస్తుందని సంకేతాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో నేడు సునీత పేరు ఫైనల్ చేయబడింది. వచ్చే నెల మొదటి వారంలో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవ్వనుంది. దీంతో ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ప్రచారం ప్రారంభించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు కేంద్రీకృతం అవుతున్నట్లు, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన… pic.twitter.com/nYGznPYvrk
— BRS Party (@BRSparty) September 26, 2025
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
అధికార కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి రాష్ట్రంలో తన బలాన్ని చూపాలనుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించింది. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ విజయం సాధించాలని పార్టీ వ్యూహాలు రూపొందిస్తున్నాయి.
ఇందులో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మేయర్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్ పై పూర్తి దృష్టి పెట్టారు. మరో వారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించవచ్చని చర్చలున్నాయి.
గత ఎన్నికల్లో అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి రేసు నుంచి తప్పించారు. నవీన్ యాదవ్, కంజర్ల విజయలక్ష్మి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ మరియు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరు టికెట్ దక్కించుకుంటారన్న అంశంపై పార్టీ లో ఉత్కంఠ నెలకొంది.