ఒకవైపు భారత్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉన్నట్టు అమెరికా ప్రదర్శిస్తూనే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై వ్యాపార పరిమితులను కఠినతరం చేస్తున్నారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సందర్భంలో, ట్రంప్ తాజాగా ఫార్మా రంగంలో 100 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, అమెరికాలో మొదట స్థానిక మెడిసిన్ తయారీ పరిశ్రమలు ఉంటే, ఆ కంపెనీలపై సుంకాలు వర్తించవని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్టు చేశారు.
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. భారత్ ఇప్పటికే 50% సుంకాలను ఎదుర్కొంటోంది. అదనంగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన కారణంగా మరిన్ని 25% సుంకాలను అమెరికా విధించింది. వీటిపై కొన్ని రోజుల క్రితం చర్చలు ప్రారంభించాయి ఇరు దేశాలు. ఈ మధ్యలో, ట్రంప్ ఫార్మా సరికొత్త 100% సుంకాలను ప్రకటించారు.
భారతదేశం అమెరికాకు జెనరిక్ ఔషధాల అతిపెద్ద ఎగుమతిదారు. 2024లో దాదాపు $8.73 బిలియన్ల విలువైన ఔషధాలను అమెరికాకు పంపింది, ఇది మొత్తం ఎగుమతులలో సుమారు 31%కి సమానం. అమెరికాలో ఎక్కువ డాక్టర్లు ఉపయోగించే మందులు ప్రధానంగా భారతదేశం నుండి వస్తాయి. IQVIA అంచనాల ప్రకారం, భారతీయ జెనరిక్ మందులు 2022లో US ఆరోగ్య వ్యవస్థకు $219 బిలియన్లను, 2013–2022 మధ్య $1.3 ట్రిలియన్లు ఆదా చేశాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్, అరబిందో వంటి కంపెనీలు అమెరికా మార్కెట్‌పై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి.
ట్రంప్ ప్రకారం, ఏ కంపెనీ అమెరికాలో తయారీ కేంద్రం కలిగినప్పుడు సుంకాల నుండి తప్పించుకోవచ్చు. నిర్మాణంలో ఉన్న కంపెనీలకు కూడా సుంకాలు వర్తించవని ఆయన తెలిపారు.
ఈ సుంకాలు ఫార్మా రంగం కాకుండా, భారీ ట్రక్కులు, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వానిటీలు, అప్హోల్డర్స్ ఫర్నిచర్ వంటివాటిపై కూడా 25–50% వరకూ విధించబడ్డాయి. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.